Bandi Sanjay: ఏపీ పాలిటిక్స్ లోకి తెలంగాణ “బండి”.. ఎందుకు ?

ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ గా సంజయ్ కు బాధ్యతలిస్తారనే ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 05:22 PM IST

తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ బలపడిందని నమ్ముతున్న అధిష్టానం.. ఆయనకు మరో పెద్ద మిషన్ ను అప్పగించాలని ప్లాన్ చేస్తోంది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ గా సంజయ్ కు బాధ్యతలిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తనను తప్పించమని కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ ఏడాదిన్నరగా పార్టీ హైకమాండ్‌ను కోరుతున్నారట. రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఆ కీలకమైన బాధ్యతను సీనియర్ నేత బండి సంజయ్ భుజ స్కంధాలపై పెట్టాలని కమల దళం జాతీయ నాయకత్వం భావిస్తోందట. ఇప్పటికే ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీకి బండి రాజకీయం తోడైతే మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురొడ్డి నిలిచిన నేతగా గుర్తింపు ఉన్న బండి సంజయ్ ఏపీలో కూడా వైఎస్సార్ సీపీ, టీడీపీలకు ధీటుగా వ్యూహ రచన చేయగలరనే అంచనాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారని తెలుస్తోంది.

కొత్త ఓటర్లపై ఫోకస్..

ఈనేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాలతో ఆగస్టు 21న బండి‌ సంజయ్ అమరావతికి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటరు నమోదును పెంచేందుకు రాష్ట్ర బీజేపీ చేసున్న కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నేతలతో బండి‌ సంజయ్ సమీక్షిస్తారని తెలుస్తోంది. ఓటర్ మొబిలైజేషన్, కొత్త ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయడంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బూత్‌ల వారీగా బీజేపీకి మద్దతు తెలిపే వారు ఎవరు? వారి పేర్లు ఓట్ల లిస్టులో ఉన్నాయా? అనే విషయాలపై ఏపీ బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ పార్టీకి బండి ప్లస్ అవుతారని భావిస్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా సహా మొత్తం ఐదు రాష్ట్రాలలో ఓటర్ల నమోదు డ్రైవ్ ఇన్‌చార్జి బాధ్యతలు బండికే బీజేపీ అధిష్టానం అప్పగించనున్నట్లు టాక్.

బండి సంజయ్ ప్రసంగ బలంపై నమ్మకంతో..

దగ్గుబాటి పురందేశ్వరిని ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా చేసిన బీజేపీ.. గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన అనుభవం కలిగిన బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గా నియమించే ఆలోచన చేయడానికి బలమైన కారణం ఉందట. బండి సంజయ్ తన అనుభవంతో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి రాజకీయ వ్యూహ రచనలో మంచి సలహాలు ఇవ్వగలరని కమల దళం నమ్ముతోందట. ఏపీలో బీజేపీ కోసం హిందుత్వ ఓటు బ్యాంకును రెడీ చేసేందుకు బండి సంజయ్ పదునైన ప్రసంగాలు పనికొస్తాయని నడ్డా భావిస్తున్నారట. ప్రత్యర్థి పార్టీలను, నాయకులను బలంగా తిప్పికొట్టే సంజయ్ వాగ్ధాటి.. ఏపీ ప్రజల చూపును బీజేపీ వైపు తిప్పుతుందని అంచనా వేస్తున్నారు.