బెంగళూరు శివారుల్లో భారీగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు CCB పోలీసులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లోని ఓ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఇందులో పాల్గొన్న ఆంధ్రా, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు దొరికిపోయారు. వీళ్ళల్లో పాతిక మందికి పైగా యువతులు కూడా ఉన్నారు. కొందరు రాజకీయ పార్టీల నేతలు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. డీజేలు…రేవ్ పార్టీల్లో కనిపించే మోడల్స్, టెక్కీలు ఉన్నట్టు తేలింది. పార్టీలో డ్రగ్స్ MDMA, కొకైన్ కూడా పట్టుబడినట్టు అధికారులు తెలిపారు.
బెంగళూరు శివారుల్లో ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫామ్స్ హౌస్ లో బర్త్ డే పేరుతో పార్టీ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఐదు నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల దాకా పార్టీకి ప్లాన్ చేశారు. 30 నుంచి 50 లక్షలు ఖర్చు చేసి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ కోసం ఆంధ్ర, తెలంగాణ నుంచి విమానంలో యువతులను రప్పించినట్టు తెలిసింది. కాన్ కార్డ్ యజమాని గోపాల రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఇది. హైదరాబాద్‌కు చెందిన వాసు ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. రేవ్ పార్టీ అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత… సీసీబీలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు అకస్మాత్తుగా దాడి చేశారు. పార్టీలో 17 MDMA ట్యాబ్లెట్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బెంజ్ కారులో ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌పోర్టు దొరికింది. అయితే ఆ కారు తనది కాదని ఎమ్మెల్యే అంటున్నారు. రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్టు కన్నడ మీడియా చెబుతోంది. ఆమె మాత్రం తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలంలో పదిహేనుకు పైగా కార్లు దొరికాయి. ఇందులో ఐషారామి మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఆడి కార్లు కూడా ఉన్నాయి. సిటీ లోపల సీసీబీ దాడులు జరుగుతుండటంతో… ఔటర్ జోన్‌లో ఈ పార్టీకి ప్లాన్ చేసినట్టు అధికారులు తెలిపారు. నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ తో స్థలాన్ని తనిఖీ చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు బెంగళూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు