ఇన్‌స్టాగ్రామ్‌లో బర్రెలక్కగా పేరు తెచ్చుకున్న శిరీష సోషల్ మీడియా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్‌గా మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న శిరీష్ ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిలవబోతోంది. గత ప్రభుత్వంపై నిరసనగా నిరుద్యోగుల తరుఫున గళమెత్తింది. అవమానాలు, దాడులు కూడా ఎదుర్కొని నిలబడి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీకి దిగింది. చాలా సీనియర్ రాజకీయా నాయకులు ఉన్న పోటీ చేయడంతో ఈ మగువ తెగువకు అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ఎన్నికల్లో శిరీష ఓడిపోయింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది.
ఈ గ్యాప్‌లోనే శిరీషకు పెళ్లి జరగడం ఓ ఇంటికి కోడలుగా వెళ్లడం జరిగిపోయింది. దీంతో ఆమె ఇక రాజకీయాలకు దూరంగానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చెప్పినట్టుగానే ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతోంది శిరీష. ఎంపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతోంది. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్న కూడా దాఖలు చేసింది. అందరూ ఆశీర్వదించాలని వీడియోను పోస్ట్ చేసింది.
ఇప్పటికే నాగర్ కర్నూల్‌లో శిరీష ప్రచారం కూడా మొదలు పెట్టేసింది. దానికి సంబంధించిన వీడియోలను కూడా నెట్టింట్లో పోస్ట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తనను ఎలా ఆదరించారో ఎంపీ ఎన్నికల్లో కూడా అలాగే ఆదరించాలని కోరుతోంది శిరీష. గత ఎన్నికల్లో ఓటమి అనుభవాలతో ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నానని.. ఈ పోరాటంలో ప్రతీ ఒక్కరి సహాయం తనకు కావాలని కోరుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు 5 వేలకు పైగా ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు ఎలాంటి తీర్పు చెప్తారో చూడాలి.