ఐపీఎల్ పై బీసీసీఐ దూకుడు, వచ్చే 3 సీజన్ల డేట్లు ఖరారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ సారి గేర్ మార్చింది. ఎప్పుడూ సీజన్ దగ్గరకొచ్చే సమయానికి షెడ్యూల్ ప్రకటించే అలవాటున్న బీసీసీఐ తొలిసారి ఐదు నెలల ముందే తేదీలు ఖరారు చేసింది.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 02:12 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ సారి గేర్ మార్చింది. ఎప్పుడూ సీజన్ దగ్గరకొచ్చే సమయానికి షెడ్యూల్ ప్రకటించే అలవాటున్న బీసీసీఐ తొలిసారి ఐదు నెలల ముందే తేదీలు ఖరారు చేసింది. 2025 సీజన్‌తో పాటు 2026, 2027 సీజన్ల తేదీలపై కూడా క్లారిటీ ఇచ్చేసింది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్ తరహాలోనే ఐపీఎల్ 2025లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు రెండు వారాల ముందుగానే ఐపీఎల్ ముగిసేలా బీసీసీఐ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. కనీసం 10 రోజుల ముందే ముగియాలన్న నిబంధనను పాటిస్తూ నిర్ణయం తీసుకుంది.

2026 సీజన్‌ మార్చి 15న ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. అలాగే ఐపీఎల్ -2027 సీజన్ మార్చి 14న మొదలై మే 30వ తేదీన ముగుస్తుంది. ఈ రెండు సీజన్లలో 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. తాజాగా ఈ షెడ్యూల్స్‌ను అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపింది. అంతర్జాతీయ షెడ్యూల్‌తో ఐపీఎల్‌ షెడ్యూల్‌ క్లాష్‌ కాకుండా ఇది తోడ్పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లతో క్లాష్ అవ్వడం వల్ల పలువురు కీలక ఆటగాళ్ళు ప్లే ఆఫ్స్ కు ముందే ఆయా ఫ్రాంచైజీలను వీడి జాతీయ జట్టు తరపున ఆడేందుకు వెళ్ళాల్సి వస్తోంది. దీంతో ఈ సారి వచ్చే మూడేళ్ళ షెడ్యూల్ తేదీలను ముందుగానే ఖరారు చేయడంతో ఐసీసీ , ఇతర క్రికెట్ దేశాల బోర్డులు కూడా తమ జాతీయ షెడ్యూల్ పై మరింత ఫోకస్ పెట్టే ఛాన్సుంది. ఇదిలా ఉంటే షెడ్యూల్ వివరాలతో పాటు మరో కీలక సమాచారాన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ అందించింది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మెగావేలంలోకి వస్తున్నాడని తెలిపింది. 575వ ప్లేయర్‌గా ఆర్చర్ ఆక్షన్‌లో అడుగుపెట్టనున్నాడు. ఆర్చర్‌ రూ. 2 కోట్ల బేస్‌ప్రైజ్‌ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది.

మెగా వేలంలో ఆర్చర్‌తో పాటు మరో ఇద్దరు కూడా కొత్తగా చేరారు. అమెరికాకు చెందిన సౌరభ్‌ నేత్రావల్కర్‌, భారత్‌కు చెందిన హార్దిక్‌ తమోర్‌ వేలంలో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిద్దరు 576, 577 నంబర్‌ ఆటగాళ్లుగా వేలం బరిలో ఉంటారు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ మెగావేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ జాబితాలో తొలుత జోఫ్రా ఆర్చర్ లేడు. కానీ తాజాగా ఆర్చర్‌ పేరును లిస్ట్‌లో చేర్చింది.