Pure Honey: ఇంత స్వచ్ఛమైన తేనె ఇంకెక్కడా దొరకదు.. ఇంతకీ ఎక్కడో తెలుసా?

సాధారణంగా బయట దొరికే తేనె ఎంత స్వచ్ఛమైనది అయినా దాన్ని తేనెటీగలు సేకరించే పద్ధతితోపాటు, అది తయారయ్యే క్రమంలోనే స్వచ్ఛత లోపిస్తుంది. పూలలోని మకరందాన్ని తేనెటీగలు సేకరించి తేనెగా మారుస్తాయి.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 05:18 PM IST

Pure Honey: స్వచ్ఛమైన తేనె అంటే.. కల్తీ కానిది.. బెల్లం పాకంతో తయారు చేయనిది.. మంచి బ్రాండ్.. ఇలాంటివి ఏవేవో చెబుతారు కదూ! కానీ, ఇప్పుడు తెలుసుకోబోయే తేనె అలాంటిది కాదు. అంతకంటే స్వచ్ఛమైనది. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన తేనె ఇది. ఒక చిన్న ద్వీపంలో మాత్రమే దొరుకుతుంది. ఈ దీవి పేరు ఈస్టర్ ఐలాండ్. ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రం మధ్యలో, ఒక మూల విసిరేసినట్టుండే దీవిలో మాత్రమే దొరికే స్వచ్ఛమైన తేనె ఇది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటీ అంటారా..?
రసాయనాల ప్రభావం
సాధారణంగా బయట దొరికే తేనె ఎంత స్వచ్ఛమైనది అయినా దాన్ని తేనెటీగలు సేకరించే పద్ధతితోపాటు, అది తయారయ్యే క్రమంలోనే స్వచ్ఛత లోపిస్తుంది. పూలలోని మకరందాన్ని తేనెటీగలు సేకరించి తేనెగా మారుస్తాయి. ఇందుకోసం తేనెటీగలు అనేక పూలు, కొమ్మలపై వాలుతాయి. తోటల్లో తిరుగుతాయి. కానీ, ఈ తోటల్లో అనేక చోట్ల అప్పటికే పురుగు మందులు, అనేక రసాయనాలు వాడి ఉంటారు. కాబట్టి, తేనెటీగల కాళ్లకు ఆ హానికర రసాయనాలు అతుక్కుంటాయి. వీటి ద్వారా వాటికి వ్యాధులు సంక్రమిస్తాయి. పూలలోని తేనెపై కూడా హానికర రసాయనాల ప్రభావం ఉంటుంది. అలాంటి తేనెటీగలు, మకరందం ద్వారా సేకరించిన తేనెను పూర్తి స్వచ్ఛమైన తేనెగా చెప్పలేం. అందుకే వీటి ప్రభావం ఏమీ లేకుండా సేకరించేదే అసలైన, స్వచ్ఛత కలిగిన తేనె. అంత స్వచ్ఛమైన తేనె దొరికేది ఈస్టర్ ఐలాండ్‌లో మాత్రమే.


ఈస్టర్ ఐలాండ్‌ ప్రత్యేకం
ఈస్టర్ ఐలాండ్ చాలా చిన్న దీవి. ఇక్కడ ఇంత స్వచ్ఛమైన తేనె దొరకడానికి ప్రధాన కారణం రైతులు. ఇక్కడి రైతులు ఎలాంటి పురుగు మందులు వాడకుండా, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. దీనికోసం ప్రాచీన వ్యవసాయ విధానాల్ని పాటిస్తున్నారు. వ్యవసాయానికి ఎక్కువగా సహజంగా పారే నీటినే వినియోగిస్తారు. నీళ్ల కోసం వర్షపు నీటిని దాచుకుంటారు. అందువల్ల ఇక్కడి నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఇటు నీళ్లు స్వచ్ఛంగా ఉండటం, ఎలాంటి హానికర రసాయనాల ప్రభావం లేకపోవడం వల్ల ఇక్కడి తేనెటీగలకు ఎలాంటి వ్యాధులు రావడం లేదు. పైగా ఇవి మంచి తేనెను సేకరించగలుగుతున్నాయి. ఇక్కడి తేనెను సేకరించే వ్యాపారులు కూడా ఎలాంటి యాంటీ బయోటిక్స్ వాడకుండా, సహజ పద్ధతినే అనుసరిస్తున్నారు.
అరుదైన తేనెటీగలు
తేనెను సేకరించే వాళ్లు, వ్యాపారులు అధిక తేనె ఉత్పత్తి కోసం అసహజ పద్ధతుల్ని పాటిస్తుంటారు. తేనెను త్వరగా సేకరించగలిగే రకం తేనెటీగల్ని వ్యాపారులు తీసుకొస్తుంటారు. వీటి వల్ల తక్కువ కాలంలో ఎక్కువ తేనె ఉత్పత్తి జరిగి, వ్యాపారులు అధిక లాభాలు అందుకుంటారు. కానీ, ఈస్టర్ ఐలాండ్ ద్వీపంలోకి ఇతర రకాల తేనెటీగల్ని తీసుకురావడాన్ని నిషేధించారు. ఇక్కడ పెరిగే తేనెటీగలు చాలా అరుదైనవి. అందువల్ల వీటిని రక్షించేందుకు స్థానికులు చర్యలు తీసుకుంటారు.

ఇక్కడి వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉండటం వల్ల తేనెటీగలు త్వరగా వృద్ధి చెందుతున్నాయి. మరింత యాక్టివ్‌గా ఉంటూ అధిక తేనెను సేకరిస్తున్నాయి. ఒక తేనెటీగల గుంపు ఇక్కడ ఒక సంవత్సరంలో 90-120 కిలోల తేనెను సేకరిస్తుంది. మిగతా తేనెటీగలు మాత్రం 20 కిలోల తేనెను మాత్రమే సేకరిస్తున్నాయి.