Bhethi Subhash Reddy: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి జంప్.. ఏం జరగనుందంటే ?

టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నో చెప్పడంతో అలిగిన ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.. పక్కచూపులు చూడటం మొదలుపెట్టారు.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 07:14 AM IST

కారు పార్టీ నుంచి సాధ్యమైనంత త్వరగా జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ తన క్యాడర్ తో దాదాపు గంటన్నర పాటు సమావేశమైన ఆయన ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందన్న దానిపై వారి అభిప్రాయాలను సేకరించినట్టు తెలుస్తోంది. తనకు బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి వస్తున్న ఆఫర్ల గురించి సన్నిహితులతో భేతి చెప్పారని తెలుస్తోంది. వారం రోజుల్లోగా ఏదో ఒకటి తేల్చేస్తానని అన్నట్టు వినికిడి. ఏ పార్టీలో చేరినా.. ఉప్పల్ నుంచి గెలిచేది తానేననే ధీమాలో భేతి ఉన్నారట. ఉమ్మడి రంగారెడ్డి తెలంగాణ ఉద్యమకారుల్లో తొలి వరుసలో ఉన్న తనకు నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారాయన. బీఆర్ఎస్ నుంచి టికెట్ పొందిన బండారు లక్ష్మారెడ్డిని ఓడించి తీరుతానని చెబుతున్నారు.

వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఉప్పల్ టికెట్ ను దక్కించుకున్న బండారు లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉంది. ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు ముందు.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు లక్ష్మారెడ్డి. గత మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కానీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భార్య కార్పొరేటర్‌ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇది ఎమ్మెల్యేకు మైనస్ పాయింట్ గా మారింది. ఇకపోతే ఉప్పల్ నియోజకవర్గంపై పట్టు కోసం పాకులాడే క్రమంలో ఎమ్మెల్యే భేతి, మాజీ మేయర్ బొంతు మధ్య ఏర్పడిన విభేదాలు కేసీఆర్ దాకా చేరడం ఇంకో మైనస్ ను క్రియేట్ చేసింది. దీంతో మూడో అభ్యర్థి కోసం వెతికిన కారు పార్టీ.. నిత్యం తమతో టచ్ లో ఉన్న బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ను కన్ఫార్మ్ చేసింది.

ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆ రెండు పార్టీలకు ఉంది. ఈ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ (బండారు రాజిరెడ్డి), 2014లో బీజేపీ (ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్), 2018లో బీఆర్ఎస్ (భేతి సుభాష్ రెడ్డి) గెలిచాయి. 2014 ఎన్నికల్లో ఉప్పల్ నుంచి బీజేపీ గెలిచిన టైంలో.. రెండో ప్లేస్ లో నిలిచిన భేతికి 68,226 ఓట్లు రాగా, మూడో ప్లేస్ లో నిలిచిన బండారు లక్ష్మారెడ్డికి 34,331 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఉప్పల్ లో పెద్దసంఖ్యలో నార్త్ ఇండియా ప్రజలు, ఆంధ్ర ప్రాంత ప్రజలు నివసిస్తుంటారు. తెలంగాణ వచ్చాక జరిగిన తొలి ఎన్నికలు కావడంతో నాటి పరిస్థితుల ప్రభావం ఇక్కడి మెజారిటీ ఓటర్ల తీర్పులో కనిపించి, ఉప్పల్ లో బీజేపీ గెలిచింది. ఏ లెక్కన చూసుకున్నా.. ఉప్పల్ లోని రాజకీయ సమీకరణాలపై భేతికి మంచి అవగాహన ఉంది. ఆయన ఏ పార్టీలో చేరితే అది.. బీఆర్ఎస్ కు ఉప్పల్ లో బలమైన పోటీ ఇచ్చే బలమైన శక్తిగా మారడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.