Tirumal Rules: కాలినడకన తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ ఏర్పాటు చేసిన కొత్త రూల్స్ ఇవే

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని పాటిస్తూ టీటీడీ కి సహకరించవలసిందిగా పలు సూచనలు చేసింది.

  • Written By:
  • Updated On - August 15, 2023 / 02:48 PM IST

గత మూడు రోజులుగా తిరుమలలో క్రూరమృగాలు నడకమార్గంలోని మెట్లమీద సంచరిస్తున్నాయి. ఇటీవలె చిన్నారిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. తిరుమలకు నడక మార్గంలో వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ కొన్ని కీలక సూచనలు చేసింది. టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అటవీ శాఖ, దేవస్థానం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

  • 12 సంత్సరాల వయసు కలిగిన పిల్లలను తమ తల్లిదండ్రులతో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకూ మాత్రమే అనుమతి.
  • పెద్దలను ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకూ అనుమతిస్తారు.
  • నడుచుకుంటూ వెళ్లే భక్తులకు ప్రతి ఒక్కరి చేతికి కర్రలను అందిస్తామన్నారు.
  • అలిపిరి ఘాట్ రోడ్డు మార్గం గుండా బైక్ మీద వెళ్లే వారిని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే వెళ్లేందుకు వీలుంటుంది.
  • తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకన్లు తీసుకున్న భక్తులు నేరుగా ఏమార్గం ద్వారానైనా తిరుమల చేరుకోవచ్చు. గాలిగోపురం వద్ద స్కానింగ్ చేసే ప్రక్రియను రద్దు చేశారు.
  • కాలినడక భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తారు.
  • వారికి ముందు వెనుక రోప్ సిబ్బంది ఉంటారు.
  • మెట్ల మార్గంలో ప్రత్యేకమైన అటవీ సిబ్బందిని నియమించి వారికి అవసరమైన పరికరాలు అందించనుంది. దీనికి అయ్యే ఖర్చు మొత్తం టీటీడీయే భరిస్తుంది.
  • కాలినడక మార్గంలో కనిపించే జింకలు, దుప్పిలు ఏ ఇతర సాధు జంతులవులకు ఆహారం తినిపించడం నిషేధించింది.
  • ఎవరైనా వాటి సమీపంలో విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.
  • వ్యాపార సముదాయాల వాళ్లు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే జరిమానా లేదా లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది.
  • వన్యప్రాణులను మానిటరింగ్ చేసేందుకు 500 ట్రాప్ కెమెరాలు ఫిక్స్ చేయడంతో పాటూ డ్రోన్ కెమెరాలు వినియోగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
  • క్రూర మృగాల జాడను 24/7 పసిగట్టేందుకు వైల్డ్ లైఫ్ ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
  • నడకమార్గంలో అనుమానాస్పద, రెడ్ జోన్లలో ఇరువైపులా 30 అడుగుల మేర ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
  • అలిపిరి నుంచి కొండపైకి వెళ్లే వరకూ అక్కడక్కడా క్రూరమృగాల గురించి వివరిస్తూ వాటి ఫోటోలను ప్రదర్శిస్తూ భక్తులకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు చేపట్టారు.

ఇవన్నీ భక్తుల భద్రత, సౌకర్యాలను అవగాహన చేసుకొని టీటీడీ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు. వీటిని పాటిస్తూ టీటీడీకి సహకరించి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

T.V.SRIKAR