టీమిండియాకు బిగ్ షాక్ గాయంతో యువపేసర్ ఔట్

భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడి ఫిట్ నెస్ కోసం శ్రమిస్తుండగా... ఇప్పుడు మరో యువ పేసర్ కూడా జట్టుకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 28, 2024 / 08:21 PM IST

భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడి ఫిట్ నెస్ కోసం శ్రమిస్తుండగా… ఇప్పుడు మరో యువ పేసర్ కూడా జట్టుకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. తన వేగంతో అందరినీ ఆకట్టుకున్న మయాంక్ యాదవ్ గాయంతో దాదాపు 3 నెలలు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. మయాంక్ వెన్నునొప్పి సమస్యతో ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆసీస్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో మయాంక్ యాదవ్ రిజర్వ్ ప్లేయర్ గా చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ పేస్ పిచ్ లపై అతన్ని కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. అయితే రెడ్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోవడంతో రిజర్వ్ ప్లేయర్ గానే ఎంపిక చేశారు. గత ఐపీఎల్‌లో మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున 4 మ్యాచ్‌లు ఆడాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. గంటకు 150 కిలోమీటర్లతో బౌలింగ్ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

తర్వాత గాయంతో ఐపీఎల్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేరుగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌ మొదటి ఓవర్‌నే మయాంక్‌ యాదవ్ మెయిడిన్‌ చేసి సంచలనం సృష్టించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా మయాంక్‌ నిలిచాడు. అతడి కంటే ముందు అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్‌ సింగ్ ఈ రికార్డ్ నెలకొల్పారు. అయితే పూర్తిగా కోలుకోకుండానే అతన్ని ఎంపిక చేశారా అన్న అనుమానం వస్తోంది. ఒక్క సిరీస్ కే అలిసిపోయాడా లేక ఫిట్ నెస్ సాధించకుండానే బంగ్లాతో సిరీస్ ఆడించారా అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సౌతాఫ్రికాతో సిరీస్ కు అతన్ని ఎంపిక చేయలేదు. ఇప్పుడు ఆసీస్ టూర్ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గాయం నుంచి పూర్తిగా కోలుకుని మళ్ళీ ఫిట్ నెస్ సాధించేందుకు కనీసం 3 నెలలు పడుతుందని అంచనా. దీని ప్రకారం చూస్తే మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కే మయాంక్ జట్టులోకి తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ఆడే అవకాశముంది. అయితే మయాంక్ కెరీర్ తో ఆడుకోవద్దని పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్లకు గాయాలు సాధారణమే అయినప్పటకీ పూర్తి ఫిట్ నెస్ సాధించకుండా జట్టులోకి తీసుకోవద్దని సూచిస్తున్నారు. గాయాలు తిరగబెడితే కోలుకునేందుకు మరింత ఎక్కువ సమయం పడుతుందని చెప్పుకొస్తున్నారు.