ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అవ్వడం ఏపీ, తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 40ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో చంద్రబాబు మునుపెన్నడూ లేని వింత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల ఉండడం ఇప్పటివరకు పొత్తులపై ఎటు తేలకపోవడంతో ఇప్పటికే టీడీపీ డిఫెన్స్‌లోనే బ్యాటింగ్ చేస్తుండగా.. ఈ అరెస్టు ప్రజల్లో కాస్త సానుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ పెద్దల అంగీకారంతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని పెద్దలు ఇప్పటికీ జగన్‌తోనే మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. ఇటు వైసీపీ కూడా బీజేపీని ప్రత్యర్థిగానే చూడడంలేదు.
చంద్రబాబుకు ఐటీ నోటిసులు.. ఈడీ ఎంట్రీతో తెలుగు తమ్ముళ్లు షాక్ తిన్నారు. అయితే ఇంతలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన కేసు. ఐటీ నోటిసులు కేంద్రానికి సంబంధించిన అంశం. ఐటీ నోటీసులతో చంద్రబాబు అరెస్ట్ అవుతారని.. సింపతి కోసం బీజేపీనే అరెస్టు చేయిస్తుందని.. తర్వాత పొత్తు పెట్టుకుందని.. సైలెంట్‌గా ప్లేటు మార్చి జగన్‌కు షాక్ ఇస్తుందని కొంతమంది భావించారు. ఎందుకంటే ఓటర్లుపై సానుభూతి అస్త్రం ఎక్కువగా పని చేస్తుంది. అందులోనూ చంద్రబాబుకు వయసు 73. ఈ ఏజ్‌లో ఆయన్ను అరెస్టు చేస్తారా అని ప్రజలు బాధ పడుతారు. ఇది టీడీపీకి ప్లస్. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటి చేస్తాయన్నది బహిరంగ రహస్యమే. ఈ విధంగా బీజేపీ ఏదో గేమ్ ప్లాన్ చేయాలని అనుకుంది. కానీ జగన్ ఊహించని విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును ఇరికించినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు స్కామ్‌లకు అతీతుడు కాదని జగన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అటు ఎప్పటిలాగే బీజేపీ ద్వంద్వ వైఖరి కొనసాగుతూనే ఉంది. ఓవైపు చంద్రబాబు వ్యవహారంలో కేంద్రం ఏమి పట్టనట్టు ప్రవర్తిస్తుండగా.. ఏపీ బీజేపీ మాత్రం ఎప్పటిలాగే టీడీపీ వెర్షన్ అందుకుంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని డైలాగులు వదులుతోంది. పొత్తులో లేకుండానే ఏపీ బీజేపీ ఎందుకింతా రియాక్ట్ అవుతుందో అర్థంకాని పరిస్థితి. ఇటు బీజేపీతో నాలుగేళ్లుగా పొత్తులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం ఎంతగానో పరితపించిపోతున్నారు. ఆయన కోసం రోడ్డుపై పడుకొంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. మణిపూర్ అంశం, రేజర్ల నిరసనలపై నోరు విప్పని పవన్ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా సమర్థిస్తుండడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.