పార్టీలు వీడదీయడం, ప్రభుత్వాల్ని కుప్పకూల్చడంలో బీజేపీ పీహెచ్‌డీ చేసింది. కూల్చడం అంటే ఆ పార్టీకి మహా సరదా. అదొక ఆట..ఈ పవర్‌గేమ్‌లో దానికెవరు సాటిలేరు..సాటిరారు.. రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేయడానికి, ఎంతకైనా దిగజారడానికి వెనకాడదు. తాజాగా శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని చీల్చింది. అజిత్ పవార్ బయటకు వచ్చేయడం డిప్యుటీ సీఎంగా ప్రమాణం చేయడం అంతా చకచకా అయిపోయింది. ఎన్సీపీ గుర్తు తమదేనని అజిత్ పవార్ తేల్చిపారేశారు కూడా. అంటే పవార్‌కు పార్టీ గుర్తు కూడా పోయినట్లే.. దానిపై కోర్టులకెళ్లడం జరుగుతుంది కానీ తీర్పు మాత్రం ఎవరికి అనుకూలంగా వస్తుందన్నది మనందరికీ తెలిసిన విషయమే.
మహారాష్ట్రలో కొంతకాలం క్రితం ఇలాగే శివసేనను చీల్చింది బీజేపీ. ఏకంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను దించేసి షిండేను ఆ సీటులో కూర్చోబెట్టింది. అబ్బే ఇదంతా శివసేన అంతర్గత వ్యవహారం అని పైకి చెప్పినా తెరవెనక చక్రం తిప్పిందంతా కమలమే అన్నది ఓపెన్ సీక్రెట్. ఏడాదిలోనే మహారాష్ట్రలోనే మరో పార్టీని చీల్చేసింది. కమలం వ్యూహానికి మరో పార్టీని బలిచేసింది.
ఒకప్పుడు వాజ్‌పేయి, అద్వానీలు నైతికతకు లోబడి ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్నివదులుకున్నారు. కాస్త ప్రలోభపెడితే ఎంపీలను తమవైపు తిప్పుకునే అవకాశం ఉన్నా విలువలకు పట్టం గట్టారు. అధికారాన్ని వదులుకున్నారు కానీ సిద్దాంతాలను మాత్రం వదల్లేదు. కానీ ఇప్పుడున్నది అప్పటి బీజేపీ కాదు కదా.. విలువలు కాదు రాజకీయ అవసరాలే ముఖ్యం. ఆ అవసరాలకు చాలా పార్టీలు బలైపోయాయి. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్‌ను చీల్చి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందుకు ప్రతిఫలంగా ఇటీవల ఓటర్లు గట్టిగా వాతపెట్టారనుకోండి. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా చేసింది. జ్యోతిరాదిత్య సింథియాను తమవైపు తిప్పుకుని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ అంటే 41మందీ పార్టీని వీడారు. ముందు పీపుల్స్ పార్టీలో చేరి ఆ తర్వాత కాషాయం కండువా కప్పుకున్నారు. పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలివిగా పడగొట్టింది. బీజేపీ కన్నుపడితే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోవాల్సిందే. బెంగాల్‌లో మమత ప్రభుత్వానికి ఎదురవుతున్న చిక్కులు అందరికీ తెలిసిందే. దీదీ కాస్త మొండి మనిషి కాబట్టి గట్టిగా ఢీకొడుతోంది.
మహారాష్ట్రలో అజిత్ కొంతకాలంగా శరద్ పవార్ తీరుపై అసంతృప్తిగా ఉన్నది నిజమే.. చాలాకాలం క్రితమే ఆయన ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలుపుతారన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో అందుకు బ్రేక్ పడింది. శరద్ ఎలాగోలా అజిత్‌ను దారికి తెచ్చుకున్నారు. అయితే అజిత్ మాత్రం అన్యమనస్కంగానే పార్టీలో ఉన్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ సుప్రియాసూలేకు ఇవ్వడంతో ఆయన తన దారి తాను చూసుకున్నారు.
అజిత్ పవార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని శరద్‌పవార్‌కు తెలుసు. అయినా తన కూతురిని వారసురాలిగా ప్రకటించారు. దీంతో అజిత్ పవార్‌కు బయటకు వెళ్లడానికి సాకు దొరికింది. అజిత్‌ను బీజేపీ ఎందుకు దువ్వింది అంటే అందుకు చాలా కారణాలే ఉన్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి కీలకం. ప్రతిసీటూ కీలకమే. మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. శివసేనను చీల్చిన అపవాదు మోస్తోంది. ఇప్పటికిప్పుడు ఆ నిందపోదు. కాబట్టి రాజకీయ అనిశ్చితిని కొనసాగిస్తోంది. రేపు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ తమకు కొంతమేర కలసి వస్తుందని కమలం నమ్ముతోంది. గుర్తులేని పవార్, ఉద్దవ్‌లు తమను గట్టిగా ఢీకొట్టలేరని భావిస్తోంది.
పార్టీలు ప్రజాఓటుతో గెలవాలి. కానీ బీజేపీ మాత్రం రాజకీయ పాచికలాట ఆడుతోంది. తమకు వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీనీ కుదురుగా ఉండనివ్వడం లేదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను బాగా టార్గెట్ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్‌ను కూడా అలాగే చీల్చబోయి చేతులు కాల్చుకుంది. మొత్తంగా చూస్తే వాజ్‌పేయి, అద్వానీల కాలం నాటి పార్టీ కాదిది. నాటి కమలం ఎప్పుడో వాడిపోయింది. విలువల వలువలు విప్పేసింది. దాని ముందు రానున్న రోజుల్లో ఇంకెన్ని పార్టీలు చీలతాయో.. ఇంకెన్ని ప్రభుత్వాలు కూలతాయో మరి..