BJP out: దక్షిణభారతంలో బీజేపీని పూడ్చిపెట్టిన కన్నడిగులు! ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో దక్షిణాదిలో బీజేపీ అస్సాం ట్రైన్‌ ఎక్కాల్సిన దుస్థితి దాపరించింది. ఇక తీరు మార్చుకోకపోతే ఉత్తరాదిన కూడా ఇదే రిపీట్ అవుతుందని ప్రతిపక్షాలు ఎత్తిపొడుస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 02:07 PM IST

ముందు కర్ణాటకలో గెలిచి.. ఆ తర్వాత తెలంగాణలో విక్టరి కొట్టీ.. అనంతరం ఏపీలో కూటమి కట్టి.. పాగా వేసి..ఇక నెక్ట్స్‌ తమిళనాడు, కేరళలో చక్రం తిప్పుతామంటూ ఊహించుకున్న బీజేపీకి సీన్‌ సితార్‌ అయ్యింది. అసలు ముందు కర్ణాటకలో గెలిచి ఏడిస్తే మిగతావి తర్వాత ఊహించుకోని ఉండే బాగుండేది..! బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మూషీ అన్నలాగా ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటే ఏం జరుగుతుందో కర్ణాటక రిజల్ట్స్‌ చూసిన తర్వాత అర్థమయ్యే ఉంటుంది. నిజానికి 2018లో కూడా బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి రాలేదు. మెజారీటి సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌ జత కట్టి రూలింగ్‌లోకి వచ్చాయి. తర్వాత ప్రతి రాష్ట్రంలో చేసినట్లే హార్స్‌ ట్రెడింగ్‌కు దిగిన బీజేపీ.. మొదట సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఆరు రోజులు, ఆ తర్వాత కుమారస్వామి సర్కార్‌ను పడగొట్టి సీఎం కుర్చిలో తిష్టవేసింది.

దక్షిణభారతంలో బీజేపీ అడ్రస్ గల్లంతు:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో దక్షిణభారతం కాషాయ పార్టీ రహితంగా మారింది. నిజానికి దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, ఏపీలలో బీజేపీకి బలం లేదు. తెలంగాణలో కొన్ని రీజియన్లలో కాస్త బలమున్నా అది రాష్టమంతటా లేదు. కర్ణాటకలోనే కాషాయ పార్టీ జెండా రెపరెపలాడే పరిస్థితి ఉండేది..అది కూడా ఇప్పుడు లేకుండాపోయింది. ఇక ఏ ముఖం పెట్టుకొని మిగిలిన రాష్ట్రాల్లో ఓట్లు అడుగుతారన్న ప్రశ్న వినిపిస్తోంది. మరో కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా బీజేపీకి కర్ణాటక రిజల్ట్ పెద్ద ఎదురుదెబ్బ!

ఏపీలో బీజేపీ పరిస్థితేంటి?
ఏపీలో బీజేపీ భిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. జనసేన పార్టీతో కలసి ప్రయాణిస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లైనా వస్తాయా అంటే కష్టమే అనిపిస్తుంది. ఒకవేళ వచ్చినా అది జనసేన పుణ్యమే! ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కట్టుగా జగన్‌పై యుద్ధం చేయాలని పవన్ కల్యాణ్‌ ప్రయత్నిస్తుండగా.. దానికి కాషాయ పార్టీ అయిష్టంగా ఉంది. ఒకవేళ టీడీపీతో కలవడానికి బీజేపీ అంగీకరించకపోతే మోదీ పార్టీతో కలిసి పనిచేయడానికి పవన్‌ ఏ మాత్రం ఇష్టంగా లేడని తెలుస్తోంది. అప్పుడు బీజేపీ ఒంటరిగా మిగిలిపోతుంది. సింగిల్‌గా పోటీ చేస్తే బీజేపీకి డిపాజిట్లు సంగతి దేవుడికెరుగు.. కనీసం నోటాకి వచ్చిన ఓట్లు కూడా రావు.

కేరళ, తమిళనాడు సంగతి మాట్లాడుకున్నా దండగే:
తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సులు దరిదాపుల్లో కూడా లేవు. హిందీని ప్రమోట్ చేసే బీజేపీ నేతలన్నా.. ఉత్తరాది పార్టీలన్నా అక్కడి ప్రజలకు చిరాకు. ద్రవిడ రాజకీయాలను తట్టుకోవడం బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితులో సాధ్యమయ్యే పని కాదు.. ఇక కేరళలో వామపక్షలదే హవా. లేకుంటే కాంగ్రెస్‌ది.ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కేరళపై బీజేపీ ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూనే ఉంటుంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బీజేపీ పెద్దలు ప్రమోట్ చేస్తుండడంతో ఆ పార్టీపై అక్కడి ప్రజలకు పీకల వరకు ఉంది. తమ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు అవమానించాలన్న ఆలోచనలతోనే బీజేపీ దగ్గరుండి ఈ సినిమాకి పబ్లిసిటీ కల్పిస్తుందని అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇలా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీకి సీన్‌ లేదని అర్థమైపోవడంతో తర్వాత ఏం చేయాలన్నదానిపై పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.