BJP:కరీంనగర్ మీద కన్నేసిన బీజేపీ. ఆ ముగ్గురి పోటీ వెనక వ్యూహం ఏంటి!?

తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అత్యంత కీలకంగా మారుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేతలు ఈ జిల్లా నుంచే ఉన్నారు.

  • Written By:
  • Publish Date - October 24, 2023 / 12:58 PM IST

తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అత్యంత కీలకంగా మారుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేతలు ఈ జిల్లా నుంచే ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు ఈ జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నాయి. ఇక బీజేపీ అయితే ఈటెల రాజేందర్‌తో పాటు ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న ఇద్దరు నేతలను ఈసారి కరీంనగర్‌ నుంచే అసెంబ్లీ బరిలో దింపుతోంది. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ ఇద్దరూ ఈ సారి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. సంజయ్‌ని కరీంనగర్‌ నుంచి, అరవింద్‌ను కోరుట్ల నుంచి పోటీలో దింపబోతోంది బీజేపీ హై కమాండ్‌.

ఇక ఈటెల రాజేందర్‌ కూడా తన సిట్టింగ్‌ స్థానం హుజురాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో పాటు సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. సీఎంపై తాను పోటీ చేస్తానని చాలా కాలం నుంచి రాజేందర్‌ చెప్తున్నారు. ఆయన డిమాండ్‌కు తగ్గట్టుగానే పార్టీ హైకమాండ్‌ను రాజేందర్‌ ఒప్పించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజేందర్‌కు రెండు స్థానాల్లో టికెట్‌ కేటాయించింది బీజేపీ. దీంతో ఆయన హుజురాబాద్‌ నుంచే కాకుండా గజ్వేల్‌ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

ఇక ఇదే ఉమ్మడి కరీంనగర్‌లో కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కూడా ఉంది. అక్కడి నుంచి బీజేపీ రాణిరుద్రమరెడ్డిని బరిలోకి దింపుతోంది. రాణిరుద్రమ కూడా బీజేపీలో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. బీజేపీలోని కీలక నేతలంతా దాదాపు ఉమ్మడి కరీంనగర్‌ నుంచే పోటీలో ఉండటంతో ఇప్పుడు కరీంనగర్‌ జిల్లా అత్యంత కీలకంగా మారింది. కరీంనగర్‌లో గెలిచి రాష్ట్ర రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి గంగుల కమలాకర్‌, కేటీఆర్‌, వినోద్‌కుమార్‌ లాంటి నేతలంతా ఉమ్మడి కరీంనగర్‌ నుంచే ఉన్నారు. ఇలాంటి జిల్లాను గనక బీజేపీ తన కంట్రోల్‌లో పెట్టుకుంటే అధికార పార్టీ మీద పట్టు సాధించినట్టే అవుతుంది. అందుకే కీలక నేతలను మాత్రమే కరీంనగర్‌ నుంచి బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. మరి కరీంనగర్‌ ప్రజలకు బీజేపీకి ఎలాంటి స్థానం ఇస్తారో చూడాలి.