ఈ ఏడాది చివరిలోపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న సమరం కావడంతో అన్ని పార్టీలకు వీటిలో గెలుపు కీలకం. ఇవి సార్వత్రిక సమరానికి కావాల్సినంత బూస్ట్ ఇవ్వడమే కాదు ప్రజలు ఎటువైపు ఉన్నారో చెప్పకనే చెబుతాయి. అందులోనూ ఎన్నికలు జరుగుతున్న వాటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు పెద్ద రాష్ట్రాలు. ఇక్కడ గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో సార్వత్రిక సమరంలోకి దూకొచ్చు. అయితే బీజేపీకి మాత్రం ఆ ఉత్సాహం దక్కేలా లేదు.
మధ్యప్రదేశ్‌లో ఓటమి తప్పదా.?
మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చింది. అయితే కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని బీజేపీ కుప్పకూల్చింది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ కాస్త గట్టిగానే నిలదొక్కకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యధిక కాలం పదవిలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఈసారి గెలుపు అంత సులభం కాదు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు ఎదురుగాలి గట్టిగానే వీస్తోంది. వరుస వివాదాలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని దిగజార్చాయని హైకమాండ్‌కు అర్ధమైంది. అందుకే పెద్దాయన రెక్కలు కత్తిరిస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్, కో ఇన్‌ఛార్జ్‌గా ఇద్దరు కేంద్రమంత్రులు భూపేష్ యాదవ్, అశ్వినీ వైష్ణవ్‌లను నియమించింది.
అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే నియమించినా మధ్యప్రదేశ్ విషయంలో గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. గతంలో ఎన్నికలకు ముందు శివరాజ్‌సింగ్ చౌహాన్ జన చైతన్య యాత్రలు నిర్వహించేవారు. కానీ ఈసారి మాత్రం చౌహాన్ ఒక్కరే కాకుండా జ్యోతిరాదిత్య సింథియా, కైలాష్ విజయవర్గీయలు కూడా ఈయాత్రల్లో పాల్గొంటారు. అంటే పరోక్షంగా చౌహాన్‌కు చెక్ పెడుతున్నట్లే…. 2003నుంచి ఇప్పటివరకు మధ్యలో 15నెలలు మినహా శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్నారు. ఆయన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. సర్వేలు కూడా బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నట్లు చెబుతున్నాయి. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వాటిని ప్రజల్లోకి బాగా తీసుకెళుతోంది. దీంతో బీజేపీకి ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదు.
ఛత్తీస్‌గఢ్‌లో హస్తవాసి..!
ఇక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్‌కు ఎడ్జ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ భూపేష్ భాగల్‌ను ఢీకొట్టే స్థాయి నేత కనిపించడం లేదు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం కాంగ్రెస్‌కు కలసి వస్తోంది.
రాజస్థాన్‌లో మొగ్గు ఎటువైపు.?
రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య వివాదాలున్నప్పటికీ ఇటీవలే వాటిని తాత్కాలికంగా అయినా హైకమాండ్ సద్దుమణిగేలా చేసింది. గతంలో ఈ ఇద్దరి కాంబో పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ ఇద్దరి మధ్య దూరం పార్టీకి కాస్త చేటు చేసిందనే ప్రచారం ఉన్నప్పటికీ మరీ అంత దారుణంగా అయితే పరిస్థితి లేదు. కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతానికి మొగ్గు బీజేపీవైపు కనిపిస్తోంది. కానీ అది స్వల్పంగానే. దీంతో ఎన్నికల నాటికి పరిస్థితి ఎటైనా మారొచ్చు. దీన్ని గ్రహించే కాంగ్రెస్ తప్పు దిద్దుకునే పనిలో పడింది. బీజేపీ స్వయంకృతాపరాథం అక్కడ పార్టీని ఓటమి పాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో బీజేపీ అంటే వసుంధరారాజేనే కనిపించేవారు. అయితే ఇప్పటికీ అక్కడ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బీజేపీ ప్రకటించలేదు. అది పార్టీని ఇబ్బంది పెట్టేదే.. వసుంధర వర్సెస్ గెహ్లాట్ అయితే మొగ్గు బీజేపీవైపే ఉంటుంది. అదే మోడీ వర్సెస్ గెహ్లాట్ అనుకుంటే మాత్రం సీన్ రివర్సై కాంగ్రెస్‌కు ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టగలరా.?
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. ఇక్కడ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. మధ్యలో కాస్త పుంజుకున్నట్లు కనిపించినా మళ్లీ కాడి కిందపడేసారు. ఇక్కడ క్లియర్ ఎడ్జ్ కేసీఆర్ వైపే కనిపిస్తోంది. ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులే లేరు. ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్న లేదా గట్టిపోటీ ఇచ్చే నేతల పేర్లు చెప్పమంటే నాలుగైదుకు మించి తట్టవు. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. అయితే బీజేపీ కంటే కాంగ్రెస్ పరిస్థితే బెటర్. మొత్తంగా చూస్తే ఇక్కడ బీజేపీ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదు.
మిజోరంలో పరిస్థితేంటి.?
మిజోరంలో బీజేపీ ఉన్నా లేనట్లే. ఇక్కడ మిజో ఫ్రంట్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుంది. ఎవరు గెలిచినా చిన్నా చితకా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే.
మొత్తంగా చూస్తే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కమలానికి షాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు బీజేపీని కలవరపెడుతోంది. మోడీ మానియా నుంచి ఇప్పుడిప్పుడే దేశం బయటకు వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గెలవడం అంత ఈజీ కాదు. అలాగని జనరల్ ఎలక్షన్స్ ముందు వాటిని లైట్ తీసుకోలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కనీసం మూడు రాష్ట్రాల్లో అయినా గెలవాలన్నది కమలం ప్రయత్నం. మరి బీజేపీకి ఆ అవకాశం వస్తుందా….?