ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(Andhra Pradesh Assembly), లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ (BJP) ఒంటరిగానే పోటీ చేయనుంది. దీనిపై ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ, జనసేన అభ్యర్థులను తొందరగా ఫైనల్ చేసే పనిలో పడ్డారు ఇద్దరు నేతలు. రాష్ట్ర విభజన, ప్రత్యేకహోదా విషయంలో ఏపీ జనం బీజేపీపై కోపంగా ఉన్నారనీ… ఆ పార్టీతో పెట్టుకుంటే టీడీపీ-జనసేన (TDP-Janasena) కూడా ఓడిపోయే అవకాశముందని గ్రహించారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమే. రాష్ట్ర విభజన కోపంతో అక్కడి జనం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకు కారణమైన మరో పార్టీ బీజేపీది కూడా దాదాపు అదే పరిస్థితి. కాకపోతే వ్యక్తి ఇమేజ్ కారణంగా, మోడీ మేనియాతో… 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ (YCP) మద్దతు ఇస్తూ ఉంది. కానీ ప్రత్యేక హోదాతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందన్న భావన మాత్రం జనంలో ఉంది. అందుకే ఈసారి ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టంగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానానికి వివరిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీ జనం బాగా కోపంగా ఉన్నారనీ… విభజన, ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేసిందని మండిపడుతున్నట్టు చెప్పారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తే… మూడు పార్టీలు నష్టపోతాయనీ…తిరిగి వైసీపీయే అధికారంలోకి వస్తుందని కమలం పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. అటు టీడీపీ కూడా వాస్తవ పరిస్థితిని వివరించింది. అసలు బీజేపీతో కలసి వెళ్ళడం టీడీపీ సీనియర్ నేతల్లో చాలామందికి ఇష్టం లేదు. ఆ పార్టీతో పెట్టుకుంటే ఏపీలో మటాష్ అవుతామని బాబును హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ ఎన్డీఏతో కలిసే ఉన్న పవన్ కల్యాణ్… బీజేపీతో పొత్తు ఉంటుందని మొదటి నుంచీ చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగిన బహిరంగ సభల్లోనూ ప్రధాని మోడీతో కలసి పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు టీడీపీ (TDP) ఒత్తిడితో పవన్ కూడా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల, కొత్త పార్టీ పెట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ కూడా … ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నారు. బీజేపీతో జతకడితే ఆ ఎఫెక్ట్ తమ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డారు చంద్రబాబు, పవన్.
బాబు, పవన్ కన్విన్స్ తో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఏపీలో తమకు ఎన్ని లోక్ సభ సీట్లు వచ్చినా… ఎన్డీఏకు మద్దతు ఇస్తామని టీడీపీ జనసేన… కమలం పార్టీ పెద్దలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బీజేపీ లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ, జనసేన నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే బాబు, పవన్ తాము పోటీ చేసే స్థానాలపై కసరత్తు ప్రారంభించారు. ఇధ్దరు నేతలు సమావేశం అయ్యారు. చాలావరకూ సీట్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో బాబు-పవన్ కలిసే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని సమాచారం. ఏపీలో ఒంటరిపోరుపై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అప్ సెట్ అయ్యారు. టీడీపీ-జనసేన (TDP-Janasena) తో కలిస్తే తాము కూడా కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని ఆశపడ్డారు. బీజేపీని ఆ రెండు పార్టీలతో కలిపి పోటీ చేయించేందుకు సుజనా చౌదరి, పురందేశ్వరి, సీఎం రమేష్ తీవ్రంగా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానం ఏపీలో ఒంటరి పోరుపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.