Khagen Murmu: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో, పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఒకరు మహిళకు ముద్దు పెట్టాడు. ఈ ఘటనపై విమర్శల వ్యక్తమవుతున్నాయి. బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఖగేన్ ముర్ము బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజక పరిధిలోని శ్రిహిపుర్ గ్రామంలో గత సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Nandamuri Balakrishna: సైకిల్ రావాలంటూ.. బాలయ్య బస్సుయాత్ర..
ప్రచారంలో ఒక ఇంటివద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఓ యువతి చెంపపై ఖగేన్ ముర్ము ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు ఖగేన్ తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఈ ఘటనపై విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా బీజేపీ తీరును ఎండగట్టింది. ‘‘బీజేపీ ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి ఖగేన్ ముర్ము ఎన్నికల ప్రచారంలో ఓ యువతికి ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా బీజేపీ క్యాంప్‌లో.. మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు. నారీమణులకు ‘మోదీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి’’ అని టీఎంసీ ట్వీట్ చేసింది.
ఈ అంశం వివాదం కావడంతో ఖగేన్ ముర్ము స్పందించారు. ‘‘ఆ మహిళను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి? కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కలిగిస్తున్నారు. వారిపై ఫిర్యాదు చేస్తాం’’ అని వివరణ ఇచ్చారు. ఇంత వివాదం జరుగుతుంటే.. సంబంధిత మహిళ మాత్రం తనకు ముద్దుపెట్టిన ఎంపీకే మద్దతు పలకడం విశేషం. ఆ యువతి మాట్లాడుతూ ‘‘నన్ను సొంత కుమార్తెలా భావించి ఖగేన్ ముర్ము ముద్దు పెట్టుకుంటే మీకు సమస్య ఏంటి? ఇలాంటివాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిది చెత్త మనస్తత్వం. ఆ ఘటన జరిగిన సమయంలో మా అమ్మానాన్నా కూడా అక్కడే ఉన్నారు’’ అంటూ ఆ అమ్మాయి బదులిచ్చింది.