KISHAN REDDY: ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ప్రకటించిందని, వాటిని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ”బిజెపి అధికారంలోకి రాగానే హైకోర్టు తీర్పునకు అనుగుణంగా మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తాం. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఫేక్. అవి ఆచరణ సాధ్యం కాని హామీలు.
PAWAN KALYAN: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం.. 22న వరంగల్‌లో రోడ్డు షో..!
ఈ ఎన్నికల్లో బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. బడుగు, బలహీన వర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కొన్ని సర్వే సంస్థలు దొంగ లీకేజీలు ఇస్తున్నా బీజేపీ అభ్యర్థులకు ఆదరణ తగ్గడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ చెప్పిందే చేస్తుంది. చేసేదే చెప్తుంది. ఓ నిశ్శబ్ధ విప్లవం తరహాలో ప్రజలు బీఆర్ఎస్‌ను గద్దె దింపుతారు. బీఆర్ఎస్ దళితబంధు, రుణమాఫీ, బీసీ బంధు, దళిత ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చలేదు. బీఆర్ఎస్ ప్రచార రథాలను గ్రామాల్లోకి రాకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. ధరణితో నష్టపోయాం. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. గ్రామ పంచాయితీకి నిధులివ్వలేదు. బీఆర్ఎస్ నేతలపై ప్రజలు ఎదురుతిరుగుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలియ్యలేని పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అవినీతి కుంభకోణాలతో ప్రజాధనాన్ని దోపిడీ చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయని.. చేతలు మాత్రం గాంధీభవన్, ప్రగతిభవన్ దాటవు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారు. కోలుకోలేని విధంగా తెలంగాణ ఆర్థిక మూలాలను బీఆర్ఎస్ దెబ్బతీసింది. భూమలు అమ్మకుండా, లిక్కర్ షాపులు నడపకుండా ప్రభుత్వం నడవని పరిస్థితి నెలకొంది” అని కిషన్ రెడ్డి అన్నారు.