కొత్త పార్లమెంట్ శవపేటికలా ఉందంటూ ఆర్జేడీ ట్వీట్ చేసింది. ఒకపక్క శవపేటిక ఫొటోను, మరోపక్క కొత్త పార్లమెంట్ భవనం ఫొటోను పెట్టి ఇదేంటి అంటూ ట్వీట్ చేసింది ఆర్జేడీ. ఈ పోస్ట్‌కు అంతే స్ట్రాంగ్‌గా బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. 2024లో మీ పార్టీకి అదే శవపేటిక దిక్కవుతుందంటూ రిప్లై ఇచ్చింది. పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి స్పూర్తి అని.. అలాంటి పార్లమెంట్‌ను అవమానించేలా పోస్ట్ చేసిన వాళ్లపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం ఉండదని.. ఈ పోస్ట్ చేసినవాళ్లకు మెదడు లేదంటూ బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. ఆర్జేడీ పార్లమెంట్‌ను శాశ్వతంగా బహిష్కరించాలని చూస్తుందా.. వారి ఎంపీలు రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు ప్రశ్నించారు. 2024లో దేశ ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెడతారని, ప్రజాస్వామ్యం అనే కొత్త దేవాలయంలోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వరని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పోస్ట్ చేశారు.
ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ తమ పార్టీ చేసిన పోస్ట్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ ట్వీట్‌లో శవపేటిక ప్రజాస్వామ్యాన్ని ఖననం చేయడాన్ని సూచిస్తోందని, పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చలకు వేదిక, అయితే బీజేపీ దాన్ని వేరే మార్గంలో తీసుకెళ్తోందని, దేశం దీన్ని అంగీకరించదని అన్నారు. రాష్ట్రపతిని పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు.
ఈ విషయంలో ఇప్పటికే చాలా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఓపెనింగ్‌కు రాలేదు. కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, జేడీయూ, ఆప్, వామపక్షాలు వంటి 20 ప్రతిపక్ష పార్టీలు హాజరుకాలేదు. బీఎస్పీ, బీజేడీ, అకాలీదల్, టీడీపీ, వైసీపీ వంటి 25 పార్టీలు ఓపెనింగ్ సెర్మొనీకి హాజరయ్యాయి. అయితే మిగిలిన పార్టీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్ ఓపెనింగ్ చేయాలని డిమాండ్ చేశాయి.
కానీ ప్రధాని చేతులమీదుగా పార్లమెంట్ ఓపెనింగ్ జరగడంతో కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు పార్లమెంట్ భవనం విషయంలో ఆర్జేడీ, బీజేపీ మధ్య పేలుతున్న ఈ ట్వీట్ల తూటాలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో చూడాలి.
ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023