నల్లగొండ ఎంపీ (Nalgonda Politics) అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్త అస్త్రాలకు పదును పెడుతోందట బీజేపీ. సొంత పార్టీ నేతలతోపాటు పక్క పార్టీల్లోని వాళ్ళ మీద కూడా ఓ కన్నేసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) నాయకుడు శానంపూడి సైదిరెడ్డిని కూడా ట్రాక్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టిన సైదిరెడ్డి. తాజాగా ఎలక్షనల్లో కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత ఉత్తంకుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న సైదిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల పేరుతో మళ్ళీ తెరమీదికి వచ్చారు.
నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారం జరిగింది. కానీ… రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఆయన తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఓటమి తర్వాత నియోజకవర్గానికి దాదాపు దూరంగా ఉంటున్న సైదిరెడ్డి తాజాగా బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ టూర్ కు కూడా వెళ్ళకపోవడం చర్చకు దారి తీసింది. రాష్ట్ర స్థాయిలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు దూరంగాను… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో కూడా గ్యాప్ ఉండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సమావేశాలకు, కార్యక్రమాలకు శానంపూడి అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. దీన్ని ఆసరా చేసుకుని సైదిరెడ్డిని బీజేపీ ట్రాక్ చేసి… తమ దారికి తెచ్చుకుంటున్నట్టు తెలిసింది. ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ టూర్ (Medigadda Tour) కు కూడా ఆయన డుమ్మా కొట్టడంతో… పార్టీ మారే ఛాన్స్ ఉందని ఇటు గులాబీ వర్గాల్లో, అటు కమల దళంలో కూడా చర్చ జరుగుతోంది. గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టిన బిజెపి సైతం నల్లగొండ పార్లమెంట్ (Nalgonda Parliament) బరిలో… రెడ్డి సామాజిక వర్గానికి చెంది.. చట్టసభలో అడుగుపెట్టిన అనుభవం, ఆర్థికంగా బలమైన నేతను బరిలోకి దింపాలని గట్టి నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలోనే శానంపూడి సైదిరెడ్డి పేరును బీజేపీ టాప్ ప్రయారిటిలో పెట్టుకున్నట్టు చెబుతున్నారు పార్టీ నేతలు. అయితే కాషాయ పార్టీ ఇస్తున్న ఆఫర్ పై మాజీ ఎమ్మెల్యే ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. అలాగని వద్దనే స్థితిలో కూడా లేరట. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని అంటూనే… అదే సమయంలో అవకాశం కోసం వెంపర్లాడవద్దని కూడా భావిస్తున్నారట. సైదిరెడ్డి పార్టీ మార్పు వ్యవహారం రెండు పార్టీలలో చర్చ జరుగుతుండగా… ఆయన అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీలకు చెందిన నేతలను, సొంత పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని వేధింపులకు గురిచేసిన అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు కొందరు.
మఠంపల్లి మండలంలోని సర్వే నంబర్ 540లో గిరిజన భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా అప్పటి బీజేపీ (BJp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్వయంగా రంగంలోకి దిగారు. గిరిజనులకు మద్దతుగా ఆందోళన చేసిన సందర్భంలో ఆయనపై జరిగిన దాడి, పలువురి పైన నమోదైన కేసులకు కారకులు ఎవరని ప్రశ్నిస్తున్నారు స్థానిక బీజేపీ నేతలు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ పెద్దలు గతం గతహ అంటారా లేక దాన్ని మనసులో ఉంచుకుని బ్రేకులేస్తారా? ఈ వివాదాలతో సైదిరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.