విజయశాంతి వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి పంచాయితీ మంటలు రేపుతున్న సమయంలోనే.. మరో వివాదం తెరమీదకు వచ్చింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు భారీ షాక్ తగిలింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలంతా ఉన్నట్లుండి.. పెద్ద ఎత్తున హైదరాబాద్ పార్టీ ఆఫీస్‌కు తరలివచ్చారు. ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆర్మూరు నియోజకవర్గంతో పాటు.. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13మండలాల పార్టీ అధ్యక్షులను అరవింద్ మార్చారని ఆందోళనకారులు గుర్తు చేశారు. ఏకపక్షంగా మండల పార్టీ అధ్యక్షుల మార్పు జరిగిందని ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి.. నిరసనకారులను పిలిపించి మాట్లాడారు. 2018ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి వినయ్ రెడ్డి, బాల్కొండ నుంచి వీఆర్ వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆర్మూర్‌లో రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన పార్టీలో చేరడం వెనక అరవింద్ కీలకంగా వ్యవహరించారు. మరోవైపు బాల్గొండలో మల్లికార్జున్ రెడ్డి కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఐతే ఈ రెండు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తెలియకుండా ఇద్దరు నేతలు పార్టీలో చేరారు. ఈ విషయమై.. ఆ ఇద్దరు నేతలు అరవింద్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కొత్త నేతలను ప్రోత్సహించడంపై అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు అరవింద్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగేలా చేసింది. ఇలానే ఎంపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోతే చివరకు పార్టీలో ఎవరూ ఉండరని కార్యకర్తలు, నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఏమైనా ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు.. అర్వింద్ మీద వ్యతిరేక జ్వాలలు రేగడం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి కాస్త ఇబ్బందే. అసలే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అరవింద్ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో నేతలు, కార్యకర్తలు నిరసనలు.. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.