Bombay HC: పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రేమికుడేం చేస్తాడు?: అత్యాచారం కేసుపై బాంబే హైకోర్టు తీర్పు

అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నా తల్లిదండ్రులు అంగీకరించకపోతే అతడేం చేస్తాడని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ కేసును కొట్టివేసింది. దీనిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 02:01 PM IST

Bombay HC: పెళ్లికి ముందే ప్రేమ పేరుతో శారీరకంగా ఒక్కటయ్యే జంటలకు సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా ఒక్కటైనంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. అయితే, ఇందుకు ఉన్న నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఈ తీర్పు వెల్లడించింది.
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలో శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే, పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అతడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రేమికురాలు కాస్తా కోర్టుకెక్కింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆమె పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నా తల్లిదండ్రులు అంగీకరించకపోతే అతడేం చేస్తాడని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ కేసును కొట్టివేసింది. దీనిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నానని, ఈ క్రమంలో ఇద్దరం ఒక్కటయ్యామని యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

Poonam Pandey: నాకేం కాలేదు.. నేను బతికే ఉన్నా.. పూనమ్ పాండే సంచలనం

అయితే, తన తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చిందన్న అతడి వాదనతో జస్టిస్ ఎం.డబ్ల్యూ.చాంద్‌వానీ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం అంగీకరించింది. నిందితుడు వివాహం చేసుకుంటాడన్న వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడని, శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని దానిని సాకుగా వాడుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వాగ్దాన ఉల్లంఘన, హామీ నెరవేర్చకపోవడం మధ్య తేడా ఉందని గుర్తు చేశారు. నిజానికి అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడని, మొదటి నుంచీ అతడు అదే ఉద్దేశంతో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే, పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేనంత మాత్రాన అతడు అత్యాచారం చేశాడని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.