మెగా వేలానికి ఆ ఇద్దరూ దూరం, బీసీసీఐ రూల్ వర్కౌట్ అయిందిగా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ఈ నెల చివరి వారంలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగనుంది. ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా...ఇపుడు ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ కూడా ఖరారయింది.

  • Written By:
  • Publish Date - November 17, 2024 / 02:15 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ఈ నెల చివరి వారంలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగనుంది. ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా…ఇపుడు ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ కూడా ఖరారయింది. ఈ సారి వేలంలో 204 స్థానాల కోసం 574 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ప్లేయర్లకు అవకాశం దక్కింది.

ఆశ్చర్యకరంగా ఈ మెగా వేలానికి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ , ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌లు పేరు లేదు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం వారిద్దరూ వేలంలో తమ పేరును రిజిస్టర్ చేసుకోలేదు. ఐపీఎల్ మెగా ఆక్షన్ లో గ్రీన్ , ఆర్చర్‌లపై భారీ అంచనాలున్నాయి. గ్రీన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 17.5 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఐపీఎల్ లో 29 మ్యాచ్ లు ఆడి 154 స్ట్రైక్ రేట్‌తో 707 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఆర్చర్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆర్చర్ అంచనాలకు మించి రాణించాడు. అయితే గాయాలతో సతమతమైన అతను.. ఐపీఎల్‌కు కూడా నిలకడగా ఆడలేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించినా.. అతను మళ్లీ మెగావేలానికి రిజిస్టర్ చేసుకోలేదు.

వీరిద్దరూ ఈ సారి ఐపీఎల్ మెగా ఆక్షన్ లో 10 కోట్లు పలకడం గ్యారంటీ అని అంచనా వేశారు. విదేశీ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ తీసుకొచ్చిన కఠిన నిబంధనతోనే ఆర్చర్, గ్రీన్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకొని.. సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో కొందరు ఆటగాళ్లు వేలంలో ఆశించిన ధర దక్కకపోతే టోర్నీ నుంచి తప్పుకునేవారు. మరికొందరూ వేలంలో అమ్ముడైన తర్వాత ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉండేవారు. ఇలాంటివారి కోసమే బీసీసీఐ నయా రూల్ తీసుకొచ్చింది. దీంతో రిస్క్ తీసుకుని నిషేధానికి గురవడం ఎందుకనుకున్న వీరిద్దరూ వేలానికి దూరమయ్యారు.