బౌలర్లూ విజయసారథులే, క్రికెట్ లో సరికొత్త మార్క్

ప్రపంచ క్రికెట్ లో చాలా జట్ల సారథులు ఎక్కువగా బ్యాటర్లే కనిపిస్తుంటారు. వికెట్ కీపర్లు కూడా జట్టు లీడ్ చేస్తుంటారు.. కానీ బౌలర్లను కెప్టెన్లుగా చూడడం తక్కువగానే చూస్తుంటాం... ఈ క్రమంలో బౌలర్లు సక్సెస్ ఫుల్ కెప్టెన్లు కాలేరా అన్న చర్చ కూడా జరుగుతూనే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - December 4, 2024 / 12:10 PM IST

ప్రపంచ క్రికెట్ లో చాలా జట్ల సారథులు ఎక్కువగా బ్యాటర్లే కనిపిస్తుంటారు. వికెట్ కీపర్లు కూడా జట్టు లీడ్ చేస్తుంటారు.. కానీ బౌలర్లను కెప్టెన్లుగా చూడడం తక్కువగానే చూస్తుంటాం… ఈ క్రమంలో బౌలర్లు సక్సెస్ ఫుల్ కెప్టెన్లు కాలేరా అన్న చర్చ కూడా జరుగుతూనే ఉంటుంది. కేవలం బ్యాటర్లు మాత్రమే సారథులుగా విజయవంతమవుతారా… అన్నది ప్రతీసారీ చర్చకు వస్తూనే ఉంటుంది. ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు అనే చెప్పాలి.. ఎందుకంటే వరల్డ్ క్రికెట్ లో బౌలర్లు కూడా సక్సెస్ ఫుల్ కెప్టెన్లుగా నిలిచిన వారు కూడా ఉన్నారు. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ప్యాట్ కమ్మిన్స్, ఇప్పుడు బూమ్రా కూడా రెడ్ బాల్ క్రికెట్ లో తమ తమ టీమ్స్ ను సమర్థవంతంగా నడిపిస్తున్నారు. కపిల్ దేవ్ ను ఆల్ రౌండర్ గానే పరిగణలోకి తీసుకున్నా… అతను కూడా గొప్ప బౌలర్ అన్న సంగతి కాదనలేం. ఓవరాల్ గా బ్యాటింగ్ కెప్టెన్ కంటే బౌలింగ్ కెప్టెన్ కు ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్ విషయంలో కాస్త అడ్వాంటేజ్ ఉంటుందన్నది అంగీకరించాల్సిందే.. ఫీల్డింగ్ సెటప్ విషయంలో కెప్టెన్ బౌలర్ తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటున్నారది కూడా సర్వసాధారణమే.

యాషెస్ కు ముందు జరిగిన పరిణామాలతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టుకు ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ను కెప్టెన్ గా నియమించింది. అతడు సారథిగా తొలి సిరీస్ లోనే అదరగొట్టాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించి ఆసీస్ కు యాషెస్ అందించాడు. ఫాస్ట్ బౌలర్లు కూడా సారథులుగా రాణించగలరని నిరూపించాడు. ఇదే ఫార్ములాను మరికొన్ని దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. భారత్ కూడా ఇదే బాటలో నడిచి బూమ్రాకు పగ్గాలు అప్పగించింది. వైస్ కెప్టెన్ గా ముందే బాధ్యతలకు అలవాటు చేసిన సెలక్టర్లు రోహిత్ గైర్హాజరీలో జట్టును లీడ్ చేసే అవకాశమిచ్చింది. ఈ క్రమంలో బూమ్రా విజయవంతమయ్యాడనే చెప్పాలి. ఆసీస్ గడ్డపై అది కూడా పెర్త్ లాంటి పేస్ వికెట్ లో కంగారూలను చిత్తుగా ఓడించడం అంత సులభం కాదు. కానీ పిచ్ పరిస్థితులను ఒక బౌలర్లు బాగా అర్థం చేసుకున్న బూమ్రా… కెప్టెన్ గానూ తనదైన ముద్ర వేశాడు.

నిజానికి క్రికెట్ లో కెప్టెన్సీ బాధ్యతలు అంత ఈజీ కాదు.. చాలా ఒత్తిడి ఉంటుంది… వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి… గెలిస్తే పర్వాలేదు… ఓడితే మాత్రం ముందు నిందించేది కెప్టెన్ నే… జట్టును సరిగ్గా నడిపించలేకపోయాడంటూ విమర్శలు వెల్లువెత్తుతాయి. భారత్ లాంటి క్రికెట్ దేశంలో అయితే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ పెర్త్ టెస్టులో బూమ్రా తనపై కెప్టెన్సీ ఒత్తిడిని అస్సలు కనిపించలేదు. బౌలర్ గా తాను ఎప్పుడూ ఎలా ఉంటాడో అలానే వ్యవహరించాడు. గతంలో ఆస్ట్రేలియాలోనే స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఎంత బాగా జట్టును లీడ్ చేశాడో అభిమానులు మరిచిపోలేరు. పలు వివాదాలు చుట్టుముట్టిన వేళ కుంబ్లే కెప్టెన్సీ అద్భుతమనే చెప్పాలి. కుంబ్లే తన రిటైర్మెంట్ కు చేరువలో ఉన్నప్పుడు కెప్టెన్సీ పగ్గాలు చేతికి రాగా… బూమ్రాకు 31వ ఏటే వచ్చాయి. రోహిత్ శర్మ మరో ఏడాది తర్వాత ఖచ్చితంగా రిటైర్ అవుతాడనే అంచనాల నేపథ్యంలో టెస్టుల్లో ఖచ్చితంగా మంచి కెప్టెన్ కావాల్సిందే.. దీనికి పరిగణలోకి తీసుకునే బీసీసీఐ బూమ్రాకు బాధ్యతలు అలవాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

బౌలర్లు కెప్టెన్లుగా సక్సెస్ కాలేరని , భారత్ లో అస్సలు కుదరదంటూ రవిశాస్త్రి లాంటి మాజీ ప్లేయర్లు అభిప్రాయపడినా పూర్తిగా ఒప్పుకోలేం. ఎందుకంటే ఈ అభిప్రాయం తప్పనే భావన రుజువవుతూనే ఉంది. 2008 పెర్త్ లో భారత్ గెలిచింది అనిల్ కుంబ్లే లాంటి బౌలర్ కెప్టెన్సీలోనే… ఆసీస్ జట్టు యాషెస్ సిరీస్ లో అదరగొట్టింది కమ్మిన్స్ లాంటి బౌలర్ సారథ్యంలోనే… అలాగే ఇప్పుడు పెర్త్ లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందించిన బూమ్రా కూడా బౌలరే.. బూమ్రా, కమ్మిన్స్ లాంటి వారి బాటలో మరికొన్ని దేశాలకు కూడా ఫ్యూచర్ లో బౌలర్లే సారథులుగా రావొచ్చు. క్రికెట్ లాంటి టీమ్ గేమ్ లో విజయాలు ఏ ఒక్కరి వల్లో రావు.. అలాగే నాయకులుగా ఎప్పుడూ బ్యాటర్లే ఉండరు… మొత్తం మీద ఇకపై బ్యాటర్లే విజయసారథులు.. బౌలర్లు కాదు అన్న అభిప్రాయం మారక తప్పదు.