ఏదీ శృతి మించకూడదు. ఏది ఎక్కువైనా తట్టుకోవడం కష్టమే. ఏదైనా లిమిట్ ప్రకారం వుంటేనే.. లేదంటే ఇబ్బందిగా మారుతుంది. ఇదంతా దేని గురించనేగా? రీసెంట్‌గా రిలీజైన స్కంద లో యాక్షన్ ఓవర్ డోస్ అయింది. లేదంటే సినిమా ఇప్పటికే హిట్ అయిపోయేది. బోయపాటి సినిమాలో యాక్షన్ సీన్స్ బాగుంటాయి. హీరోను బాగా ఎలివేట్ చేస్తాయి. ఈ యాక్షన్‌తోనే.. హీరోకు మాస్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. అయితే.. చాలాసార్లు ఓవర్‌డోస్ తలనొప్పిగా మారుతోంది.
బోయపాటి సినిమాలో ఫైట్స్ ఎక్కువే కాదు హై ఓల్టేజ్‌లో వుంటాయి. సాధారంగా డైరెక్టర్స్ పాటలు.. ఫైట్స్ జోలికి వెళ్లరు. మాస్టర్స్‌కు వదిలేస్తారు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఫైట్స్ డిజైన్ చేసినా.. అన్నీ తానై చూసుకుంటాడు బోయపాటి. దగ్గరుండి చూసుకోవడంలో తప్పులేదు. మరి మాస్టర్స్ తీస్తారో.. లేదంటే.. బోయపాటి తీయమంటాడోగానీ.. ఫైట్స్ హద్దులు దాటేస్తాయి. సినిమాలో ఇన్ని ఫైట్స్ అవసరమా అనిపిస్తుంది. ఈ మోతాదు ఎక్కువై ఎన్టీఆర్‌తో తీసిన దమ్ము బోర్ కొట్టింది.
బోయపాటి ప్రతి సినిమాలో ఫైట్స్ ఎక్కువే అయినా.. హీరో క్యారెక్టరైజేషన్‌ను కొత్తగా చూపిస్తూ.. ఓవర్‌డోస్ గురించి మర్చిపోయేలా చేస్తాడు. లేటెస్ట్ మూవీ స్కందకు ఇదే మైనస్ అయింది. భారీ క్లైమాక్స్ వుండగా.. దీని ముందు అతి భారీ ఫైట్ అవసరమా అనిపిస్తుంది. ఈ ఓవర్ డోస్ లేకుంటే సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒక్కోసారి అతి కూడా కొంప ముంచుతుంది. ప్రతిసారీ ఎలివేషన్స్.. హీరో క్యారెక్టరేజేషన్స్‌తో ఈ ఓవర్‌డోస్ కొట్టుకుపోయినా.. ఈసారి వర్కవుట్ కాలేదు.
కేవలం స్కంద మాత్రమే కాదు..మొదటి రెండు సినిమా లు మినహాయిస్తే అన్ని అంతే. కాకపోతే బాలకృష్ణ సింహ, లెజెండ్, అఖండ లో కాస్త యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ఉండటంతో బతికి పోయారు. కానీ మిగిలిన సినిమాల్లో బోయపాటి ఓవర్ యాక్షన్ అడుగడుగునా హీరోలో కనిపిస్తుంది. ఆ అతి నలుగురు హీరోలను బలి తీసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లుడు శ్రీను, ఇప్పుడు రామ్ పోతినేని. ఒక్కో సినిమా లో హీరో కనీసం 500 మందినైనా చంపాల్సిందే. లాజిక్ అనే మాట లేదు. బోయపాటి అతి తట్టుకోలేక మెగా హీరోలు మొత్తం దూరమై పోయారు. సరైనోడు హిట్ అయినా బన్నీ ఇప్పటికీ మళ్లీ ఛాన్స్ ఇవ్వలేదు. అసలు ఊహకు అందని ఫైట్స్ జనానికి వెగటు పుట్టించడమే కాదు.. బోయపాటి అంటే భయపడే పరిస్థితి వచ్చింది.