సమకాలిన క్రికెట్ లో విరాట్ కోహ్లీని రికార్డుల రారాజుగా పిలుస్తారు.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించే విరాట్ వందలకొద్దీ రికార్డులు అందుకున్నాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను సైతం వెనక్కి నెట్టాడు. గత కొన్ని నెలలుగా సరైన ఫామ్ లో లేకున్నా విరాట్ పేరు మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు తండ్రి తగ్గ తనయుడిగా కోహ్లీ కొడుకు రికార్డుల మోత మోగిస్తున్నాడు. నిండా పది నెలల వయస్సు కూడా లేని అకాయ్ కోహ్లీ సరికొత్త రికార్డు సాధించాడు. గూగుల్‌లో ఈ ఏడాది అర్థం కోసం ఎక్కువ వెతికిన రెండో పదంగా అకాయ్ నిలిచింది. అకామ్ అర్థం తెలుసుకునేందుకు ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలు తమకు కొడుకు పుట్టాడని, అతనికి అకాయ్ అని పేరు పెట్టుకున్నామని ప్రకటించగానే.. ఆ పదం అర్థం కోసం నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారని గూగుల్ పేర్కొంది.
కాయ అనే హిందీ పదం నుంచి అకాయ్ వచ్చినట్లు అప్పట్లో భాషా నిపుణులు పేర్కొన్నారు. కాయ్ అంటే కాయం. అంటే శరీరం అని అర్థం. అకాయ్ అంటే పుష్టికరమైన శరీరం కలవాడని అర్థం. ఇక టర్కిష్ భాషలో అకాయ్ అంటే మెరిసే చంద్రుడిని అర్థం. అలాగే కోహ్లీ కొడుకు ఫోటో కోసం కూడా నెటిజన్లు బాగా సెర్చ్ చేశారు. అకాయ్ కోహ్లీ పుట్టినప్పుడు అదే పేరుతో హ్యాష్ ట్యాగ్‌తో మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.. పుట్టిన వారం రోజులకే అకాయ్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన బ్రాండ్ క్రియేట్ అయ్యింది. 2 గంటల్లోనే హ్యాష్ ట్యాగ్ వాడి మిలియన్ పోస్టులు పోస్ట్ అయ్యాయి.. అతి తక్కువ సమయంలో 1 మిలియన్ దాటిన రికార్డు, బుల్లి కోహ్లీ పేరిట నమోదైంది. అయితే సోషల్ మీడియాకి దూరంగా, సెలబ్రిటీ స్టేటస్ లేకుండా ఓ సామాన్యుల్లా పిల్లలను పెంచాలని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. అనుకుంటున్నారు అందుకే ఇప్పటివరకూ వామిక కోహ్లీ ముఖాన్ని కూడా మీడియాకి చూపించలేదు