Car Number: ఫ్యాన్సీ నెంబర్లంటే చాలా మందికి మోజు. కారు, బైక్, మొబైల్ ఫోన్.. ఇలా చాలా వాటికి తమకు కావాల్సిన నెంబర్లనే ఎంచుకుంటారు కొందరు. వాటి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. నెంబర్ల కోసం ఎక్కువ మంది పోటీపడితే నిర్వాహకులు, ప్రభుత్వాలు వేలంపాట నిర్వహిస్తుంటాయి. దీంతో ఫ్యాన్సీ నెంబర్లు ఈ వేలంపాటలో అధిక ధర పలుకుతాయి. తాజాగా ఒక కారు నెంబర్ ధర ఏకంగా రూ.122 కోట్లు పలికింది. దుబాయ్‌లో ఒక కారు నెంబర్ ఇలా అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.
మన దేశంలోనూ ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజ్
మన దేశంలో 9 అంకె ఉన్న నెంబర్లు, 786 వంటి నెంబర్లతోపాటు తమ లక్కీ నెంబర్ కలిసి వచ్చేవి, ట్రిపుల్ డిజిట్ నెంబర్లపై క్రేజ్ ఎక్కువ. వీటి కోసం కొందరు ఎన్ని డబ్బులైనా వెచ్చిస్తారు. సినిమా తారలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు వీటి కోసం లక్షలు వెచ్చిస్తుంటారు. తమ వాహనాలు, మొబైల్ నెంబర్స్ కోసం ఇలా ఖర్చు పెడుతుంటారు. దీని ద్వారా ప్రభుత్వ రవాణా సంస్థకు, మొబైల్ సంస్థలకు భారీ ఆదాయం సమకూరుతుంది.
కారు నెంబర్ కోసం రూ.122 కోట్లు
దుబాయ్‌కు చెందిన ఒక సంస్థ కారు నెంబర్లను వేలం వేస్తుంటుంది. అక్కడి షేక్‌లు, వ్యాపారవేత్తలు వీటి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. తాజాగా ఒక వ్యక్తి కారు నెంబర్ కోసం ఏకంగా రూ.122 కోట్లు వెచ్చించాడు. పీ7 అనే వీఐపీ కారు నెంబర్ కోసం జరిగిన వేలంలో ఒక వ్యక్తి 55 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.122 కోట్లు) పెట్టి, ఆ నెంబర్ దక్కించుకున్నాడు. ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడైన కారు నెంబర్ ప్లేట్ ఇదే కావడం విశేషం. దీంతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ ప్లేట్ల విషయంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.
ఈ డబ్బుతో ఏం చేస్తారంటే
వాహనాల నెంబర్ల వేలం ద్వారా సంపాదించిన డబ్బును దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సంస్థ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వినియోగించబోతుంది. ఎమిరేట్స్ ఆక్షన్ పేరుతో అనేక వాహనాల నెంబర్లను వేలం వేస్తుంది ఈ సంస్థ. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇటీవల వేలాన్ని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే డబ్బులను పేదల కోసం ఖర్చు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదల ఆకలి తీర్చేందుకు చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు ఈ డబ్బుల్ని వినియోగిస్తారు. దీనికోసం ఈ సంస్థ 100 మిలియన్ దిర్హామ్‌లను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా వేలం నిర్వహించగా, పీ7 నెంబర్ ప్లేట్ ద్వారా ఇప్పుడు రూ.122 కోట్ల నిధులు సమకూరాయి.
మరిన్ని నెంబర్లకూ భారీ ధర
పీ7 ఒక్క నెంబర్ మాత్రమే కాకుండా ఈ వేలంలో ఇతర నెంబర్లు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ‘ఏఏ22’ అనే నెంబర్ సుమారు రూ.18 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే ఏఏ19కు సుమారు రూ.10 కోట్లు వచ్చాయి. వీటితోపాటు ఏఏ80, హెచ్31, ఎక్స్36, జెడ్37, డబ్ల్యూ78, ఎన్41 నెంబర్లు కూడా భారీ ధర పలికాయి. వాహనాల నెంబర్లతోపాటు కొన్ని మొబైల్ నెంబర్లను కూడా దుబాయ్ సంస్థ తాజా వేలం ద్వారా విక్రయించింది. ఈ వేలంలో కారు నెంబర్ ధర మాత్రం కొత్త రికార్డు నెలకొల్పింది.