క్రికెట్ అభిమానులకే కాదు బ్రాడ్ కాస్టర్ కు కూడా ఈ నెలన్నర రోజులు పండగనే చెప్పాలి. ప్రపంచకప్ టైమ్ లో భారీగా ఆర్జించేలా బ్రాడ్ కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది. వన్డే ప్రపంచకప్ సమయంలో అన్ని వయసుల వారు మ్యాచ్ లను చూసేందుకు టీవీలకు.. మొబైల్స్ కు అతుక్కపోతారు. ఇక యువత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచకప్ కు భారీగా వీక్షకులు ఉండే అవకాశం ఉండటంతో బడా కంపెనీలు తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకునేందుకు ప్రపంచకప్ ను వేదికగా చూస్తుంటారు.
ప్రపంచకప్ మ్యాచ్ ఓవర్ల మధ్యలో ఉండే చిన్నపాటి సమయాన్ని దక్కించుకునేందుకు బ్రాడ్ కాస్టర్ కు కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 10 సెకన్ల యాడ్ కు రూ. 30 నుంచి 40 లక్షలు చెల్లించేందుకు బ్రాండెడ్ కంపెనీలు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ లెక్కన సెకనుకు రూ. 3 నుంచి 4 లక్షలు అన్నమాట. 2019 వన్డే ప్రపంచకప్ తో పోలిస్తే ఈసారి రేట్లు 40 శాతం అధికంగా ఉన్నాయి. యాడ్స్ ద్వారానే ప్రపంచకప్ సమయంలో రూ. 2 వేల కోట్ల ఆదాయం వస్తుందని స్టార్ స్పోర్ట్స్ అంచనా వేసింది. వన్డే ప్రపంచకప్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితకంగా ప్రసారం కూడా చేస్తోంది. దాంతో యూజర్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాచ్ లను పెద్ద ఎత్తున చూసే అవకాశం ఉంది. అక్కడ కూడా యాడ్స్ తో స్టార్ స్పోర్ట్స్ భారీగా ఆర్జించే అవకాశం ఉంది.