Harrasement: మోదీ చేసిన తప్పే కేసీఆర్‌ కూడా చేశారు!అక్కడ రెజ్లర్లు.. ఇక్కడ శేజల్..!

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషన్‌పై రెజ్లర్ల ఎలాంటి లైంగిక ఆరోపణలు చేశారో శేజల్‌ కూడా చిన్నయ్యపై అలానే చేసింది. అయితే కేసీఆర్‌ కానీ మోదీ కానీ ఈ విషయంలో మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 06:32 PM IST

తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే..చట్టం, న్యాయం, ధర్మం విషయంలో చుట్టరికాలు చూడకూడదు. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు..! అయితే ధర్మ రక్షకులమని..ఆ భగవద్గీతే తమ దైవమని చెప్పుకునే నాయకులు మాత్రం చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్టుంటుంది.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రక్షించడమే ‘పెద్దలు’ పనిగా పెట్టుకున్నారా అన్న డౌట్ వస్తోంది. ఎందుకంటే బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషన్‌పై లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని 40రోజులకు పైగా నిరసన చేస్తున్న రెజ్లర్ల విషయంలో ప్రధాని మోదీ ఇప్పటివరకు నోరు విప్పింది లేదు. ఇటు మూడు నెలలుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆధారాలతో సహా లైంగిక దాడి ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్‌ ​డెయిరీ నిర్వాహకులు శేజల్‌ గురించి బీఆర్‌ఎస్‌ పెద్దలు మాట్లాడిన పాపానపోలేదు. కేటీఆర్‌ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని.. తన గురించి చిన్నయ్య అనుచరులు తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్‌మీడియాలో తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ శేజల్‌ సూసైడ్ అటాంప్ట్ చేయడం..ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడం అత్యంత బాధాకరం.

చర్యలు కాదు.. అసలు కంప్లైంట్ కూడా తీసుకోరు:
WFI ఛీఫ్‌ బ్రిజ్‌భూషన్‌పై తాము చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలంటూ గత జనవరిలోనే రెజ్లర్లు రోడెక్కారు. అప్పుడు తప్పుడు హామీలు ఇచ్చిన కేంద్రం తర్వాత తన మాట నిలబెట్టుకోకపోవడంతో మరోసారి ఏప్రిల్‌లో రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. ఈసారి వాళ్లపై పోలీసులు మ్యాన్‌ హ్యాండ్లింగ్‌ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా గురించైతే మాట్లాడారు కానీ ఆ తర్వాత కానీ..అంతకముందు కానీ సందర్భమున్నా కూడా మౌనమే వహించారు.. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే చేస్తున్నారు. ఓ ఎంపీని పరోక్షంగా మోదీ ఎలా కాపాడుతున్నారో.. కేసీఆర్‌ కూడా అలానే రక్షిస్తున్నారు.

శేజల్‌ గత మార్చిలోని ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆరోపణలు గుప్పించింది. తనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు కూడా చేసింది శేజల్. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. తన దగ్గర ఎంత బలమైన ఆధారాలు లేకపోతే శేజల్ అంత దూరం ఎందుకు వెళ్తుంది..? వెళ్లదు కదా! ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని… తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని.. తెలంగాణ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద ధర్నాకు దిగింది శేజల్‌. అయితే మూడు రోజులుగా ఆమెపై లేనిపోని ఫేక్‌ ప్రచారాలు సోషల్‌మీడియాలో కనిపించడం మొదలయ్యాయి. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ కొన్ని అసభ్యకరమైన పోస్టులు కనిపించాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ముందు విషం తాగారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉండగా.. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ పెద్దలు ఈ విషయంపై నోరు విప్పలేదు.