BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు.. ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్‌లోని నివాసంలో కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులపై చర్చించారు. కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఎవరు.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 05:14 PM IST

BRS-BSP: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు బీఆర్ఎస్, బీఎస్పీ ప్రకటించాయి. ఈ మేరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడిగా ప్రకటన చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పని చేయబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నివాసంలో కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులపై చర్చించారు.

PM MODI: తెలంగాణలో 7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ..

కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఎవరు.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ తరఫున సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీఆర్ఎస్‌తో పొత్తుకు ప్రవీణ్ మొగ్గు చూపారు. ఆ పార్టీ మద్దతుతో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గెలవాలని భావిస్తున్నారు. కేసీఆర్, ప్రవీణ్ చర్చల అనంతరం.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బుధవారం బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడతానని, అనంతరం పొత్తు విధి విధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. బీఎస్పీకి కొన్ని సీట్లు కేటాయిస్తామని కేసీఆర్ వెల్లడించారు.

కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఏర్పడిందని, ఈ రెండు పార్టీల నుంచి తెలంగాణను కాపాడుకోవడానికే పొత్తులు పెట్టుకున్నామని ప్రవీణ్ కుమార్ అన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్తామని బీరాలు పలికిన కేసీఆర్.. ఈసారి పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీఎస్పీతో పొత్తుకు కేసీఆర్ రెడీ అయ్యారు. మరోవైపు గతంలో ఎంఐఎంతో బీఆర్ఎస్‌కు అవగాహనా ఒప్పందం ఉండేది. మరి ఈసారి ఎంఐఎం.. బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుందా.. లేదా తెలియాలి.