KCR CAMPAIGN: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజక వర్గాల్లో BRS ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. రాష్ట్రంలో ఇప్పటికే 70కి పైగా నియోకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు.
ఇవాళ్టి నుంచి ఈ నెల 28న ప్రచారం ముగింపు తేదీ లోపు కేసీఆర్.. మరో 23 బహిరంగ సభల్లో పాల్గొంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి దాకా ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రచారం చేయలేదు. సిటీలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కేసీఆర్… ప్రచారాన్ని కూడా అక్టోబర్ 15 నుంచే మొదలుపెట్టారు. హుస్నాబాద్ సభ నుంచి ఎన్నికల ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు 74 సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు.
తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. రెండో విడత ప్రచారంలో కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ క్యాంపెయిన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జనం ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. కరెంట్ కోతలు, రైతు బంధు రాదని చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కారు గుర్తుకే ఓటు వేయాలని కేసీఆర్ కోరుతున్నారు.