Mynampally Hanumanth Rao: మైనంపల్లికి షాక్ ఇవ్వబోతున్న బీఆర్ఎస్‌..!

మైనంపల్లి రాకతో కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది అన్న సంగతి ఎలా ఉన్నా.. మైనంపల్లిని టార్గెట్‌ చేస్తూ బీఆర్ఎస్ కదుపుతున్న పావులు ఆసక్తికరంగా మారాయ్. మైనంపల్లికి దిమ్మ తిరిగి, మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రేంజ్‌లో షాక్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 03:16 PM IST

Mynampally Hanumanth Rao: మంత్రి హరీష్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత కారు పార్టీకి దూరమై కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో.. గులాబీ పార్టీ మీద.. ముఖ్యంగా మంత్రి హరీష్‌ రావు మీద కోపం పెంచుకున్నారు. ఆ కోపాన్ని బయటపెట్టారు. కట్‌ చేస్తే బీఆర్ఎస్‌కు దూరం అయ్యారు. తనకు, తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ హామీతో.. కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి.. హరీష్ రావు టార్గెట్‌గా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

మైనంపల్లి రాకతో కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది అన్న సంగతి ఎలా ఉన్నా.. మైనంపల్లిని టార్గెట్‌ చేస్తూ బీఆర్ఎస్ కదుపుతున్న పావులు ఆసక్తికరంగా మారాయ్. మైనంపల్లికి దిమ్మ తిరిగి, మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రేంజ్‌లో షాక్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. మైనంపల్లి చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయ్. మల్కాజ్‌గిరి, మెదక్‌.. రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు ఇద్దరు కీలక నేతలు దూరం అయ్యారు. ఆ ఇద్దరిని కారులోకి లాగేందుకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ టికెట్ మైనంపల్లికి ఖాయం కావడంతో.. నిరాశపడిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ హస్తానికి బైబై చెప్పేశారు. ఇక మెదక్ సీటు విషయంలో కాంగ్రెస్ నిర్ణయంతో షాకైన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి దూరమయ్యారు. వీరిద్దరూ కాంగ్రెస్‌ని వీడారు కానీ.. ఇతర పార్టీల్లో చేరే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వీరిద్దరితో బీఆర్ఎస్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

బీఆర్‌ఎస్‌లో తిరుపతిరెడ్డి చేరికకు సంబంధించి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి నివాసంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలం అయితే తిరుపతి రెడ్డితోపాటు, నందికంటి శ్రీధర్ కూడా బీఆర్ఎస్‌కి చేరువయ్యే అవకాశాలు ఉన్నాయ్. తన సొంత బలం ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలంతో మైనంపల్లి.. ఆ రెండు నియోజకవర్గాల్లో గెలుపు ధీమాతో ఉన్నారు. ఐతే కాంగ్రెస్‌కు ఇప్పుడు బలం దూరం అవుతోంది. వారిద్దరూ బీఆర్ఎస్‌లో చేరితే అది ఆ పార్టీకి అదనపు బలం అవుతుంది. దీంతో మల్కాజ్‌గిరి, మెదక్ నియోజకవర్గాల విషయంలో రోజుల వ్యవధిలోనే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయ్.