Balka Suman: బాల్క సుమన్ వ్యాఖ్యలు నిజమేనా? కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఎవరు?

కాంగ్రెస్ పై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Updated On - August 29, 2023 / 12:48 PM IST

‘కాంగ్రెస్ లోకి కోవర్టులను పంపాం’ అంటూ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ పంపిన ఆ కోవర్టులు ఎవరు ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధమైన విశ్లేషణ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ లీడర్లపై హస్తం పార్టీ పెద్దలకు డౌట్ ను క్రియేట్ చేసేందుకే సుమన్ ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చని కొందరు చెబుతుంటే.. అది నిజమే అయి ఉండొచ్చని ఇంకొందరు అంటున్నారు. 2018 అసెంబ్లీ పోల్స్ లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంతోమంది బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అలా జాయిన్ అయిన వాళ్లలో కొందరు కారు పార్టీ టికెట్స్ ఈసారి దక్కకపోవడంతో.. మూటాముళ్లె సర్దుకొని మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికే కొందరు హస్తం పార్టీలో చేరిపోయారు కూడా !!

‘బెనెఫిట్ ఆఫ్ డౌట్’ ఫార్ములాతో బీఆర్ఎస్ ఎటాక్..

కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలాన్ని పుంజుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. ప్రజలకు ఆ పార్టీ నేతలను గోడ మీద పిల్లుల్లాగా చూపించాలనే స్కెచ్.. బాల్క సుమన్ ‘కోవర్టు’ వ్యాఖ్య వెనుక ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చెన్నూర్ బీఆర్‌‌ఎస్ టికెట్‌ ఈసారి కూడా సుమన్‌ కే దక్కింది. నియోజకవర్గంలో ఆగస్టు 26న నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దు. కొంతమందిని మేమే కాంగ్రెస్ పార్టీలోకి పంపాం. అందరూ మన దగ్గరికే మళ్లీ వచ్చేస్తారు’’ అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. బాల్క సుమన్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు సన్నిహితంగా బీఆర్ఎస్ లీడర్లలో ఒకరు. వారి సూచన మేరకే ఆయన ఈ కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నుంచి మొదలుకొని రేఖానాయక్ దాకా గత మూడు నెలల్లో బీఆర్ఎస్ నుంచి ఎంతోమంది కాంగ్రెస్ లో చేరారు. అయితే వీరిపై కాంగ్రెస్ కు అనుమానాన్ని పెంచి, సమయాన్ని వృథా చేయించి.. ఎన్నికలపై నుంచి హస్తం పార్టీ చూపును పక్కదారి పట్టించాలనే ప్రయత్నం ఈ కామెంట్స్ లో దాగి ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యూహం ద్వారా ‘బెనెఫిట్ ఆఫ్ డౌట్’ ను పొందాలని కేసీఆర్ అండ్ టీమ్ భావిస్తోందని అంటున్నారు.

గోడ మీద పిల్లి వ్యవహారాలు కామన్..

రాజకీయాల్లో గోడ మీద పిల్లి వ్యవహారాలు కామనే అని.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం కూడా కామనేనని రాజకీయ పండితులు తేల్చి చెబుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి.. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ లో ముఖ్య నేతగా వ్యవహరించిన.. ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో కీలక స్థానంలో ఉన్నారు. అంతెందుకు సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కూడా ఒకప్పుడు టీడీపీలో మొదలైంది. పరిస్థితులు, వివిధ కారణాల ప్రభావంతో పార్టీలు మారినంత మాత్రాన.. నాయకులకు కోవర్టులనే ట్యాగ్ తగిలించడం సరికాదు. వాస్తవానికి రాజకీయ పార్టీల నేతల మధ్య రాజకీయాలకు అతీతంగా సత్సంబంధాలు ఉంటాయి. మీడియా ముందు మాత్రమే లీడర్లు ఒకరినొకరు తిట్టుకుంటారు. కెమెరా పక్కకు వెళ్లగానే ఫ్రెండ్లీగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇదంతా మాయా రాజకీయంలో ఒక ఆట. మీడియాలో కనిపించేదంతా నిజం కాదని ప్రజలు అర్థం చేసుకోవాలి.