MLC KAVITHA JAIL: BRS ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలుకు వెళ్ళారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు కవితకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దాంతో అధికారులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లోనే కొనసాగనుంది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు MLC కవితను ఉదయం 11 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.
AAP party : ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్ పార్టీ పిలుపు.. మోదీ ఇంటికి భద్రత పెంపు..
కోర్టు లోపలికి వెళ్ళే ముందు కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదనీ.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని కామెంట్ చేశారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చు కానీ.. క్లీన్‌గా బయటకొస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్‌గా మారను అన్నారామె. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడు. ఇంకో నిందితుడికి ఆ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. 3వ నిందితుడు బీజేపీకి 50 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొన్నాడని కవిత ఆరోపించారు. అయితే, కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరోసారి కస్టడీకి కోరతారని అనుకున్నారు. కానీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని కోరారు.
దాంతో న్యాయమూర్తి కవితను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఆ తర్వాత కవితను తిహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. అయితే కవిత కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయనీ.. ఆమెకు ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 1 న వాయిదా వేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. అప్పటిదాకా కవిత తిహార్ జైల్లోనే గడపనున్నారు.