Minister KTR: ఖమ్మంపై గురి పెట్టిన కేటీఆర్‌… ఆ పని సాధ్యం అయ్యేనా..?

తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్‌ పార్టీకి బలం బాగానే ఉంది. ఐతే ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ డౌటే ! వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే.. ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు.

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 01:39 PM IST

వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినా.. గులాబీ పార్టీకి తీరని లోటు ఏదైనా ఉంది అంటే.. అది ఖమ్మంలో బలం పెంచుకోలేకపోవడమే! నంబర్‌ పరంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా తమ పార్టీ వారే అనిపించినా.. అసలు విషయం ఆరా తీస్తే.. ఆ బెంగ డబుల్ అవుతుంది. తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్‌ పార్టీకి బలం బాగానే ఉంది. ఐతే ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ డౌటే ! వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే.. ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. మొన్నటివరకు బీఆర్ఎస్‌లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో సీన్ మరింత మారిపోయింది. గత ఎన్నికల్లో బడా నేతలు ఉన్నా సరే.. ఖమ్మంలో బీఆర్ఎస్‌ గెలిచింది ఒక్క సీటు మాత్రమే. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్‌ లాగేసుసుకుంది. ఐతే సంఖ్యాపరంగా బీఆర్ఎస్‌ బలం పెరిగింది కానీ.. క్షేత్రస్థాయిలో ఆ బలం మాత్రం పెరిగినట్లు లేదు.

ఇక జిల్లాలో 10సీట్లకు అభ్యర్ధులని ప్రకటించేశారు. దానికి ముందే బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నేతలు హస్తం పార్టీలోకి వచ్చేశారు. ఈ మధ్య తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడు కూడా కాంగ్రెస్‌లోకి వచ్చారు. దీంతో సీన్ మారిపోయింది. మళ్లీ ఖమ్మంలో కాంగ్రెస్ హవా ఉంటుందనే విధంగా రాజకీయం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్తితుల్లో ఖమ్మంపై కేసీఆర్ స్పెషల్‌ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఖమ్మంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎన్ని నిరసనలు ఎదురైనా ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఖమ్మంలో ఆవిష్కరించిన కేటీఆర్‌.. సత్తుపల్లిలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ పార్టీ పేరు మాత్రమే వినిపించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీని ద్వారా జిల్లాలో బీఆర్ఎస్ బలం పెంచాలని ప్లాన్ చేస్తున్నారు.

అలాగే కొన్ని చేరికలు ఉండేలా కూడా గులాబీ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ గురించి తెగ పొగిడేయడం.. ఎన్టీఆర్‌కు, కేటీఆర్‌కు కంపారిజన్‌ క్రియేట్ చేసి మాట్లాడడం… ఇవన్నీ అందులో భాగంగానే కనిపిస్తోంది. ఎలా అయినా సరే.. కాంగ్రెస్‌ గురించి బజ్‌ లేకుండా చూడాలని కేటీఆర్‌ రచిస్తున్న స్ట్రాటజీ ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఐతే కేటీఆర్ ఎంత కష్టపడినా.. గులాబీ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచించినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ హవా అనేది కష్టమైన విషయం అని చాలా మంది అంటున్నారు. కమ్యూనిస్టుల అండ ఉంటే కారు పార్టీ బలంగా అయ్యేది. ఐతే కమ్యూనిస్టులని వదిలేసింది. ఇప్పుడు వారు కాంగ్రెస్‌కు దగ్గర అవ్వాలని చూస్తున్నారు. అదే జరిగితే ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్‌కు మళ్లీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది.