BRS MLA Candidates: ఖర్చు వాచి పోతోంది మహాప్రభో.. అనవసరంగా సీట్లు ముందే ప్రకటించారా

ఎలక్షన్లకు ఇంకా మూడు నెలల టైం ఉంది. కానీ.. అన్ని పార్టీలకూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏకంగా 115మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించేశారు. పక్క పార్టీలు అభ్యర్థుల వేటలో పడటమేమో కానీ..ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు పెరిగిపోయింది.

  • Written By:
  • Updated On - August 29, 2023 / 12:50 PM IST

కేసీఆర్..115 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. ఇది మా దమ్ము అని విపక్షాలకు సవాల్ విసిరారు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థుల పేర్లు ప్రకటించడం అంటే ఒక రకంగా సాహసమనే చెప్పుకోవచ్చు. వీళ్లే మా గెలుపు గుర్రాలు.. మీ రేసు గుర్రాల సంగతేంటి అని విపక్షాలకు సవాల్ విసిరడం ఒకెత్తయితే.. ఇప్పటి నుంచే ప్రచారంలో దూసుకెళ్లొచ్చు. ప్రజలకు చేరువ కావొచ్చు అన్నది కేసీఆర్ ప్లాన్.

టికెట్ కన్‌ఫామ్ చేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు ఆనందంలో మునిగిపోయారు. నియోజకవర్గాల్లో తమకు ఎంత పట్టుంది అని లెక్కలేసుకుంటూనే.. ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారు. అయితే.. లిస్ట్ రావడం ఆలస్యం.. పార్టీలో అసమ్మతి భగ్గుమంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అగ్గిమీగ గుగ్గిలమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటించడంతో వారిని ఓడించి తీరతామని అసంతృప్తులు ప్రకటనలు చేస్తున్నారు. అంతే కాదు.. రహస్య సమావేశాలతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో అభ్యర్థులకు.. కంటిమీద కునుకు లేకుండా పోయింది.

మరోవైపు.. మూడు నెలల ముందే టికెట్లు ఖరారు చేయడం కూడా అభ్యర్థుల్లో ఆందోళన పెంచుతోంది. ఎందుకంటే.. ఇప్పటి నుంచి మూడు నెలల పాటు కార్యకర్తలను, ద్వితీయశ్రేణి నాయకులను కాపాడుకోవాలి. ఇది మామూలు విషయం కాదు. ఎప్పుడైతే అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చేశాయో.. ఇంకేముంది కార్యకర్తలకు పండగే పండగ. అన్నా అంటూ వస్తున్న క్యాడర్‌ను సంతృప్తి పరచాల్సిందే.. లేదంటే ఎక్కడ టైం చూసి దెబ్బకొడతారో అన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది.

కరెక్టుగా పండగల సీజన్ ముందు టికెట్లు రావడం సంతోషం కలిగిస్తున్నా.. పండగల సమయంలో కార్యకర్తలను ఎలా మేనేజ్ చేయాలో అభ్యర్థులకు అర్థం కావడం లేదు. పర్సనల్ నుంచి గ్రామస్థాయి పనుల వరకు చేయాలి లేదంటే పత్యర్ది పార్టీలోకి కార్యకర్తలు జంప్ అయ్యే ప్రమాదముంది. వార్డు మెంబర్‌, ఎంపిటిసీ,ఎంపిపి, జెడ్పీటీసీ, కార్పోరేటర్లను కంటికి రెప్పలా చూసుకోవలసి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. కేడర్‌ను కాపాడుకోవాలి అంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని కొందరు నేతలు హైరానా పడుతున్నారు. వీటికి తోడు.. సోషల్ మీడియా, యాడ్స్, ప్రచారం ఇలా మూడు నెలల పాటు ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో.. ఎన్నికల కోసం అయ్యే మొత్తం వ్యయానికి.. ఈ మూడు నెలల వ్యయం సమానమని బీఆర్ఎస్ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.