ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవితను (MLC Kalvakuntla Kavitha) మళ్ళీ తీహార్ జైలుకు తరలించారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను తిరిగి రౌస్ ఎవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో ప్రవేశపెట్టారు. అయితే న్యాయమూర్తి ఆమెను ఈనెల 23వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దాంతో కవితను తిహార్ జైలుకు తీసుకెళ్ళారు అధికారులు. మూడు రోజుల విచారణలో కవిత తమకు సహకరించలేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. మీడియాతో మాట్లాడటంపై కవిత మీద సీరియస్ అయ్యారు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి.
కవిత 3 రోజుల కస్టడీ ముగియడంతో రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు సీబీఐ అధికారులు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించినా సహకరించలేదనీ… పొంతనలేని సమాధానాలు చెప్పారని ఆరోపించారు. 11 పేజీలతో స్పెషల్ కోర్టులో రిమాండ్ అప్లికేషన్ వేసింది సీబీఐ. శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై కవితను ప్రశ్నించాం. లేని భూమి ఉన్నట్టుగా చూపించి… అమ్మకానికి పాల్పడిన సంగతిపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు అధికారులు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఉన్నాయని తెలిపింది CBI. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించినా కవిత సమాధానం ఇవ్వలేదు. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి ఉన్న వ్యక్తి. అంతేకాదు… కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు, చెరిపేసే అవకాశముంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను కూడా పరిశీలించాల్సి ఉంది. అందువల్ల కవితకు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించాలని సీబీఐ అధికారులు న్యాయమూర్తిని కోరారు. దాంతో కోర్టు ఈనెల 23 దాకా కస్టడీ విధిస్తూ… కవితను తిహార్ జైలుకు పంపింది.
కోర్టులోకి వెళ్ళే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదు… బీజేపీ కస్టడీ… బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేదే…లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారని ఆరోపించారు. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు.. కొత్తదేమీ లేదని కామెంట్ చేశారు. అయితే కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కోర్టు ఆవరణలో మీడియాతో ఎలా మాట్లాడతారని సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా మీరెలా మాట్లాడతారని కవితపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి మీడియాతో మాట్లాడవద్దని న్యాయమూర్తి కవితకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.