Telangana, KCR : కర్ణుడు చావు..కేసీఆర్ ఓటమి ఒకటే !

పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన.. కేసీఆర్ చెప్పాడంటే చేసి తీరతాడంటూ బలంగా నమ్మిన జనం... ఢిల్లీతో కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చింది నేనే.... తెలంగాణను కూడా నేనే అభివృద్ధి చేస్తానంటూ పదే పదే చెప్పిన కేసీఆర్. ఇంత అనుకూలతలున్న బీఆర్ఎస్ ఎందుకు ఓడింది ?. బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అంశాలేంటి..?

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 04:34 PM IST

తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల మన్ననలందుకున్న బీఆర్ఎస్‌కు గట్టిషాక్ తగిలింది. రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ, ఉద్యమనేత కేసీఆర్‌ను ఎవరూ వదులుకోరని ధీమాగా ఉన్న గులాబీ పార్టీకి ప్రజలు ఊహించని షాకిచ్చారు. కనీసం బొటాబొటి మెజార్టీ వచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని భావించిన కేసీఆర్ అండ్‌ కో.. కు ఛాన్స్ లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టారు. బీఆర్ఎస్ ఓటమి వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి.

BRS నేతల అహంకారం అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం.. జనంపై చాలా ప్రభావం చూపింది. దొరల తెలంగాణ కూల్చి ప్రజల తెలంగాణ తెచ్చుకుందామన్న నినాదం ఉధృతంగా వినిపించింది. నియామకాల అంశం తెలంగాణ ఉద్యమంలో ప్రధానాంశం. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఉంటుందని .. తెలంగాణ యువత ఆశపడింది. 6 యూనివర్సిటీల్లో విద్యార్థులంతా జాబ్ క్యాలెండర్ కావాలని, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులవృత్తులు చేసుకుంటే సరిపోతుందన్న కొందరు మంత్రుల వ్యాఖ్యలు,  TSPSC లీకుల పర్వం.. అగ్నికి ఆజ్యం పోశాయి.  యేళ్ళ  తరబడి హాస్టల్స్ ఫీజులు, ఖర్చులు భరించి కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరిగి పరీక్షలకు ప్రిపేరైతే.. లీకులు వారి సహనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రవల్లిక ఎపిసోడ్.. నిరుద్యోగుల్ని మరింత  రగిలింప చేసింది.

ఎన్నికలకు ముందు చక్కని ప్రచారాస్త్రమవుతుందని భావించిన కాళేశ్వరం.. బీఆర్ఎస్ సర్కార్‌ను గట్టిగా దెబ్బతీసింది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బ్యారెజ్ పిల్లర్లు కుంగిపోవడం.. బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమని విపక్షాలు తీవ్రంగా దాడి చేశాయి. ఈ విమర్శలతో అధికార పార్టీ గుక్క తిప్పుకోలేకపోయింది.  అవినీతికి.. కాళేశ్వరం నిర్మాణం అడ్డా అని విపక్షాలు చేసిన ప్రచారం.. బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి తోడు ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించడం, కమిటీ వేయడం.. ఈ అవినీతి అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో బీఆర్ఎస్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది.

బీఆర్ఎస్‌లో కొందరు ఎమ్మెల్యేలు,  ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముత్తిరెడ్డి సహా కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కోర్టుల్లోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో అవినీతి సర్కార్.. కమిషన్ సర్కార్.. అందుకే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదంటూ విపక్షాలు తూర్పారబట్టాయి. వీటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించినా అవేవీ ఫలించలేదు.