Byjus Employees: బైజూస్ పునర్వవస్థీకరణతో ఉద్యోగులకు ఎదురుదెబ్బ.. వేల మంది రోడ్డునపడే అవకాశం

బైజూస్ ఆన్లైన్ విద్యారంగంలో ఒక సంచలనం సృష్టించింది. కరోనా కాలంలో ఒక వెలుగు వెలిగిన బైజూస్ ఇప్పుడు నిధులు అడుగంటి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు తన ఉద్యోగులను కోతకు గురిచేసేందుకు సిద్దమైంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 03:31 PM IST

కోవిడ్ కి ముందు కోవిడ్ కి తరువాత అన్న విధంగా మారిపోయింది నేటి విద్యారంగం. గతంలో ఆఫ్లైన్ క్లాసులు తప్ప మరేఇతర తరగతులు పిల్లలకు బోధించేవారు కాదు. కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని పిల్లల విద్యా విధానంలో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యారంగంలో ఆన్లైన్ అనే సరికొత్త ఒరవడి వెలుగులోకి వచ్చింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మొదలు పీజీ స్థాయి వరకూ అందరూ ఆన్లైన్ లోనే పాఠాలు వినడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బైజూస్ అనే దేశీయ ఎడ్ టెక్ సంస్థ పిల్లలకు ఆన్లైన్ పాఠాలు, అత్యుత్తమమైన ప్రమాణాలతో అందించేలా ఒక యాప్ ను రూపొందించింది. చిన్న స్టార్టప్ గా కెరియర్ ప్రారంభించిన అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగింది. చాలా మంది మన్ననలను పొందింది.

బైజూస్ కి సంబంధించిన సీఈఓ కూడా తాజాగా మారారు. గతంలో రవీంద్రన్ ఉండే వారు. ప్రస్తుతం అర్జున్ మోహన్ వ్యవస్థాపకులుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో సంస్థ పునర్వవస్థీకరణకు సిద్దమౌతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సుమారు 3500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ విధంగా చేయడానికి ప్రదాన కారణం తమ ఉద్యోగులకు ఇచ్చే వేతన భారాన్ని తగ్గించుకోవడం. ప్రస్తుతం వివిధ శాఖలుగా విడిపోయి పనిచేస్తున్న బైజూస్ రానున్న రోజుల్లో ఉమ్మడిగా కలిసి పనిచేసేందుకు అన్ని విభాగాలను విలీనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ వారంలో దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలు పెట్టారు.

వీలైనంత త్వరగా సంస్థలోని ఉద్యోగులను పునర్వవస్థీకరించి ఖర్చులను నియంత్రించాలని భావిస్తోంది. తద్వారా జరిగే నష్టాన్ని కొంతమేరకైనా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విభాగాల్లో ఒకే రకమైన ఉద్యోగులను ఉంచి పనిచేయించుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలా ఎంపిక చేసిన వారిని మినహా మిగిలిన వారిని బయటకు పంపించే యోచన చేస్తున్నారు. అలాగే అనుబంధ సంస్థగా ఉన్న ఆకాశ్ సహా పలు విదేశీ వ్యాపారాల్లోని ఉద్యోగులపై ఎలాంటి వేటు పడదని స్పష్టం చేసింది. ఈ సంస్థ మంచిగా రాణించిన తరుణంలో దాదాపు 52వేలకుపైగా ఉద్యోగులు పనిచేశారు తాజాగా వీరి సంఖ్య 35 వేలకు పడిపోయింది. రానున్న రోజుల్లో ఈ పునర్వవస్థీకరణ విధానంతో ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

T.V.SRIKAR