Sidda Ramaiah: కర్ణాటకలో మరోసారి రాజకీయ అనిశ్చితికి తెరలేపిన మంత్రి.. సిద్దరామయ్యకు పదవీ గండం తప్పదా..?

కర్ణాటకలో సీఎం సిద్ద రామయ్యకు వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచే దింపేందకు పావులు కదుపుతోంది.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 11:06 AM IST

కర్ణాటక పేరు చెబితే గతంలో రాజకీయ అనిశ్చితి గుర్తుకొస్తుంది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికిచి చాటుకుంది. విజయమే లక్ష్యంగా అన్ని శక్తులను ఒడ్డింది. చివరకు సీఎంగా నువ్వా నేనా అన్న విధంగా సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ ల మధ్య వాడి వేడిగా చర్చలు జరిగాయి. చివరకు ఢిల్లీ పెద్దల బుజ్జగింపు చర్యలతో శివకుమార్ వెనక్కి తగ్గారు. దీంతో సిద్ద రామయ్యకు సీఎం పదవి వరించింది. ఇదంతా మన్నటి వరకూ రాజకీయం. తాజాగా కర్ణాటక సీఎం పీఠంలో కుదుపులు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డీకే శివకుమార్ వర్గం కాదు. క్యాబినెట్లో కొనసాగుతున్న మంత్రి సతీశ్‌ జార్ఖిహోలి ఈ రాజకీయ క్రీడకు తెరలేపారు.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దాని ప్రభావం తెలంగాణలో తీవ్రగా పడింది. అధికారమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ నేతలు, ఢిల్లీ అధిష్టానం హామీలు, గ్యారెంటీ స్కీములు ప్రకటిస్తూ జోష్ మీద ఉంది. బీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దెదింపాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో కార్ణాటక సీఎం కుర్చీపై వస్తున్న వార్తలు టీ కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. కన్నడ నాట కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుని సరిగ్గా ఐదు నెలలు కూడా పూర్తికాలేదు. అప్పుడే ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో దీని ప్రభావం ఎక్కడ తమపై పడుతుందో అని బిక్కుబిక్కు మంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు.

ఇదిలా ఉంటే సిద్ద రామయ్యను సీఎం నుంచి తొలగించాలని పన్నాగం ఎవరు పన్నారో తెలుసుకునేందుకు సిద్దమైంది అధిష్టానం. తన కేబినెట్లో కొనసాగే మంత్రి సతీశ్ జార్ఖిహూలి ఈ పరిస్థితికి తెరలేపినట్లు గుర్తించింది. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా సిద్దుకి వ్యతిరేకంగా ఓటింగ్ జరపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం అంతర్గత విభేదాలు, వర్గపోరు అని తెలుస్తోంది. ఇలా సహచర మంత్రి వర్గంలోని వారే సీఎం కుర్చీ పై కన్నేయడంతో చాలా మంది షాక్ కి గురవుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాను రంగంలోకి దింపింది. ఈయన హుటాహుటిన బెంగళూరు చేరుకొని మంత్రి సతీశ్ తో చర్చలు జరిపారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇలాంటి రాజకీయాలు చేయడం సరైన పద్దతి కాదని నచ్చజెప్పారు.

నిన్న మన్నటి వరకూ సిద్ద రామయ్య, డీకే శివకుమార్ ఈ రెండు వర్గాలే సీఎం రేసులో ఉండేవి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతంతో మరో వర్గం సిద్దూకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై స్థిరత్వం కొనసాగుతుందా.. లేక మరో మహారాష్ట్ర లాగా మారుతుందా అనేది వేచిచూడాలి.

T.V.SRIKAR