Tapping Case : ట్యాపింగ్ కేసు నిరూపించగలరా ? ఆధారాల సేకరణలో సిట్ బిజీ

తెలంగాణలో సంచలన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును (Phone Tapping Case) టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) కింద నిరూపించగలరా ? అందుకు తగినన్ని ఆధారాలను పోలీసులు సేకరించారా ? ఇప్పటిదాకా ఈ చట్టం గురించి FIR లో రాయకపోవడానికి కారణం ఏంటి ? మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి ?

తెలంగాణలో సంచలన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును (Phone Tapping Case) టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) కింద నిరూపించగలరా ? అందుకు తగినన్ని ఆధారాలను పోలీసులు సేకరించారా ? ఇప్పటిదాకా ఈ చట్టం గురించి FIR లో రాయకపోవడానికి కారణం ఏంటి ? మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి ?

ఫోన్ ట్యాపింగ్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ పై పోలీసులు పూర్తిగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఈ కేసులో పోలీస్ అధికారులు ప్రణీత్ రావు (Praneet Rao), రాధాకిషన్ రావు (Radhakishen), భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలోకి తీసుకొని ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు. BRS పార్టీకి చెందిన మాజీ మంత్రులు, నేతల ప్రమేయంపైనా ఆరా తీశారు. ఫోన్ ట్యాపింగ్ ని అడ్డం పెట్టుకొని వ్యాపారులు, రియల్టర్లు, సినిమా నటీ నటులు, రాజకీయ నేతలను బెదిరించి… ఆస్తులు, డబ్బులు లూఠీ చేయడంపైనా ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును టెలిగ్రాఫ్ చట్టం కింద నిరూపణ చేయగలిగితే… SIBలో పనిచేసిన మాజీ పోలీస్ అధికారులతో పాటు BRS కీలకనేతలకు శిక్షలు పడే అవకాశం ఉంది. కానీ టెలిగ్రాఫ్ చట్టం కింద నిరూపణ చేయడం అంత ఈజీ కాదు. ట్యాపింగ్ కు ఉపయోగించిన ఎక్విప్ మెంట్, హార్డ్ డ్రైవ్ లు, కంప్యూటర్లను ప్రణీత్ రావు బృందం… ధ్వంసంచేసి మూసీలో పడేసింది. వాటి శకలాలు సేకరించిన పోలీసులు అందులో డేటా సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు. SIB, టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన వారితో పాటు మొత్తం 34 మంది స్టేట్ మెంట్స్ కూడా పోలీసులు సేకరించారు. వీటి ఆధారంగా ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కూడా వివరాలను రాబడుతున్నారు. ఓ ప్రముఖ టెలికం ప్రొవైడర్ సంస్థకి చెందిన ఉద్యోగి సహకారంతో ప్రణీత్ రావు అండ్ టీమ్ అడ్డగోలుగా ట్యాపింగ్ కి పాల్పడినట్టు తేలింది. ఆ ఉద్యోగిని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అప్పుడే టెలిగ్రాఫ్ చట్టం వినియోగించే అవకాశాలున్నాయి.

కేటీఆర్ సవాల్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి ?

బీఆర్ఎస్ హయాంలో SIB ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనడానికి అన్ని ఆధారాలను, స్టేట్ మెంట్స్, సాక్ష్యాలను పోలీసులు చాలామటకు సేకరించారు. ఈ ట్యాపింగ్ కి ఎవరు ఆదేశించారన్నది ప్రూవ్ చేయడం కాస్త ఇబ్బందిగా మారే ఛాన్సుంది. ఫోన్ ట్యాపింగ్ నేరాన్ని ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా నిరూపించలేకపోయారు. అందుకే టెలిగ్రాఫ్ చట్టం కింద ఒక్క కేసు కూడా దేశంలో నమోదు కాలేదు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నా… ఆయన్ని దోషిగా నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలను పోలీసులు సేకరించగలరా అని డౌట్స్ వస్తున్నాయి. అందుకే కేటీఆర్ కూడా అంత ధైర్యంగా సవాల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా… ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి తనంతట తానుగా వచ్చి అప్రూవర్ గా మారతాడన్న టాక్ నడిచింది. కానీ ఆయన రాకపై మళ్ళీ సమాచారం లేదు. పోలీసులకు ట్యాపింగ్ పరికరాలను సమకూర్చింది రవిపాల్ అని చెప్పారు. ఆ టెక్నికల్ ఎక్స్ పర్ట్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు… ఇంకా ప్రశ్నించలేదు.
ట్యాపింగ్ మాటు అక్రమాలపైనే కేసులు

ఫోన్ ట్యాపింగ్ ని నిరూపించడం మాటేమో గానీ… ఆ టెలిఫోన్ సంభాషణలను అడ్డం పెట్టుకొని… అడ్డగోలుగా దోచుకున్న ఆస్తులు, డబ్బులపైన మాత్రం పోలీస్ అధికారులు, BRS మాజీమంత్రులు, లీడర్లపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీస్ అధికారులు కొందరు దొరికిపోయారు… ఇక మిగిలింది BRS లీడర్లు మాత్రమే. మరోవైపు – ఈ కేసుపై విచారణకు ఆదేశించాలని గవర్నర్ రాధాకృష్ణన్ కోరుతోంది బీజేపీ. ఎన్నికల కమిషన్ కు కూడా కంప్లయింట్ చేస్తామంటోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ కాలక్షేపం చేస్తున్నా… తాము మాత్రం వదిలిపెట్టేది లేదంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పోలీసులు సేకరించే టెక్నికల్ ఎవిడెన్స్ మీదే కేసు మొత్తం ఆధారపడి ఉంది.