Canada Vs India: భారత్ – కెనడా మధ్య చెడిన సంబంధాలు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టమో తెలుసా..?

కెనడాకు చెందిన ఖలిస్థానీ నాయకుడు హరదీప్ సింగ్ హత్యపై భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు మనకు తెలిసిందే. దీంతో భారత్ ఆ దేశంతో దౌత్యం తెంచుకుంది. తద్వారా ఎగుమతులు, దిగుమతులు మొదలు మనోళ్లు అక్కడకు వెళ్లేందుకు వీసాలు కూడా నిలిపివేయబడ్డాయి. దీంతో కెనడా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 08:12 AM IST

మన దేశం నుంచి ప్రతి సంవత్సరం కెనడాకు విద్యనభ్యసించేందుకు 2లక్షలకు పైగా విద్యార్థులు కెనడా బాట పడుతున్నారు. తాజాగా వెల్లడైన వీసా గణాంకాల్లో ఈ ఏడాది 2.25 లక్షల మంది భారతీయులకు వీసాలు మంజూరు అయినట్లు తెలిసింది. ఈ లెక్కన మనోళ్ల ద్వారా ఆ దేశం ఏస్థాయిలో లబ్థి పొందుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒక ఐదు శాతం రాబడి తగ్గినా దాని నుంచి కెనడాకు వాటిల్లే నష్టం కోట్లలోనే ఉంటుంది. ఢిల్లీకి చెందిన మేధా సంస్థ ఇమేజ్ ఇండియా తాజగా చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏటా కెనడాకు వెళ్ళే విద్యార్థుల్లో ఐదుశాతం తగ్గినా కెనడాకు ఏడాదికి 73కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తేలింది.

దీనికి కారణాలేంటి..

సాధారణంగా భారతీయులు కెనాడాకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్తూ ఉంటారు. ఒక వేళ విద్య పూర్తైతే సంవత్సరం నుంచి మూడేళ్ల పాటూ కెనడాలోనే పని చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద సంఖ్యలో కెనడాకు వెళ్లేందుకు మనోళ్లు ఆసక్తి చూపుతున్నారు. కెనడా విద్యా విధానం ప్రకారం ఏడాదికి మూడు సార్లు అనగా జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో ప్రవేశాన్ని కల్పిస్తాయి. ఈ సమయంలో మాత్రమే విద్యాసంస్థల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో మన దేశం నుంచి 66వేల మంది విద్యార్థులు కెనడా బాట పట్టారు. తాజాగా ఇరుదేశాల మధ్య చెడిన దౌత్య సంబంధాల కారణంగా ఇందులో ఐదు శాతం అంటే, 3,300 మంది తగ్గినా.. కెనడా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.

విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయం ఇలా..

కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలంటే అక్కడి కళాశాలలో ప్రవేశించే సమయంలోనే ఒక్కో భారతీయ విద్యార్థి 16వేల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే ల్యాప్ టాప్, ఇంటి అద్దె, బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్, ఫ్లైట్ ఖర్చులు అన్నీ కలుపుకొని మొత్తంగా చెల్లించాలి. ఇక రెండేళ్ల పూర్తి విద్యాభ్యాసానికి సంబంధించి.. ఒక్కో విద్యార్థి 53 వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రవేశ రుసుము, చదువుకు సంబంధించిన ఖర్చులు రెండూ కలుపుకుంటే ఒక్కో విద్యార్థి నుంచి 69వేల డాలర్లు కెనడా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతుంది. ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ఇందులో ఐదు శాతం తగ్గినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 23వేల కోట్ల డాలర్లు కోతకు గురయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం జనవరి లెక్కలు మాత్రమే. ఇక మే, సెప్టెంబర్ నెల్లోనూ ఐదు శాతం కలుపుకుంటే 69 కోట్ల డాలర్ల మేరా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

వీసా ఫీజుల్లోనూ నష్టపోయే అవకాశం..

ప్రస్తుత కెనడా – భారత్ పరిస్థితుల వల్ల ఇరు దేశాల విదేశాంగ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మనోళ్లను అక్కడకు పంపించేందుకు వీసాలు ఇచ్చే ప్రక్రియను నిలిపివేసింది భారత్. దీంతో కెనడాకు వీసాల ఫీజు రూపంలో వచ్చే ఆదాయంలో 30 లక్షల డాలర్లకు గండిపడింది. ఇలా కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం తగ్గి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందికర పరిణామలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పైగా దీని ప్రభావం చిన్న వ్యాపారాలపై కూడా పడుతుంది.

చిన్న వ్యాపారాలకు ఇబ్బందులు..

ఇండియా నుంచి కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గితే అక్కడి చిన్నవ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ దేశంలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు పనిచేసేందుకు అనుమతి ఇస్తారు. ఇలా పనిచేసినందుకుగానూ గంటకు 11 డాలర్ల జీతాన్ని ఇస్తాయి. అయితే కెనడాలో స్థానికంగా పనిచేసే శ్రామికులు ఇలా తక్కువ వేతనానికి, విదేశీయులతో సమాన వేతనానికి పనిచేయడానికి అంగీకరించరు. ప్రతి గంటకు అదనంగా మరో రెండు డాలర్లు డిమాండ్ చేస్తారు. దీంతో చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అదనంగా వ్యయ భారం పడుతుంది. ఇది చిన్నవ్యాపారాల్లో వేతనాల పెరుగుదలకు దారితీస్తుంది. తద్వారా మరో 3.4 కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా కాలేజీల్లో దరఖాస్తు ఫీజుల మొదలు వీసా, వ్యాపారాల్లో వేతనాల వరకూ అన్నీ కలుపుకుంటే దాదాపు 73 కోట్ల డాలర్లు గండిపడే అవకాశం ఉంటుందని తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది.

T.V.SRIKAR