హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. చెరువులను ఆక్రమించేవాళ్లను వదిలిపెట్టం అని స్పష్టం చేసారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదు అని కుండబద్దలు కొట్టారు సిఎం. చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం అని అన్నారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తాం అన్నారు. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం అన్నారు ఆయన. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతిసంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది అన్నారు రేవంత్.
చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపాన్ని చూశామని భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలన్నారు రేవంత్ రెడ్డి. కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధజలాలు వదులుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి వ్యర్ధమే అన్నారు ఆయన.
అందుకే హైడ్రా ద్వారా… చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నామని స్పష్టం చేసారు. కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో.. చెరువుల ఆక్రమనలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఇది రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం అని స్పష్టం చేసారు. ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా ఈ కార్యక్రమం ఆగదని రేవంత్ మరోసారి స్పష్టం చేసారు. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుందని పేర్కొన్నారు.