CM Revanth Reddy : రేవంత్ కాన్వాయ్ కి.. కేసీఆర్ కొన్న కార్లు

మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతానని కొనుక్కున్న ల్యాండ్ క్రూయిజర్ కార్లు త్వరలో తెలంగాణకు రాబోతున్నాయి. ఈ కార్ల కోసం కేసీఆర్ 66 కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్యే ఆరోపించారు.

మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతానని కొనుక్కున్న ల్యాండ్ క్రూయిజర్ కార్లు త్వరలో తెలంగాణకు రాబోతున్నాయి. ఈ కార్ల కోసం కేసీఆర్ 66 కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్యే ఆరోపించారు. అయితే ఈ కార్లలో మూడింటిని రేవంత్ కాన్వాయ్ కి వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మిగతా కార్లను ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మూడోసారి కూడా ముఖ్యమంత్రి పదవిని చేపడతానని కలలు కన్నారు మాజీ సీఎం, BRS చీఫ్ కేసీఆర్. అందుకే ముచ్చటపడి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రభుత్వ ఖజానా నుంచి 66 కోట్లు ఖర్చుపెట్టి 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అవి ప్రస్తుతం ఏపీలోని విజయవాడలో త్రిహాయని ఇంజినీరింగ్ వర్క్స్ దగ్గర రెడీగా ఉన్నాయి. వాటిని డెలివరీ చేస్తామని తీసుకోవాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది ఆ కంపెనీ. ఈ వెహికిల్స్ బుల్లెట్ ప్రూఫ్ తో పాటు శాటిలైట్ కనెక్షన్ కూడా ఉంది. బయట ఏం జరుగుతుందో లోపల నుంచే స్క్రీన్స్ పై చూడటానికి అవకాశం ఉంటుంది.

ప్రజల సొమ్మును ఎలా దుర్వినియోగం చేశారో చూడండంటూ 22 కార్ల కొనుగోలు సంగతిని రేవంత్ రెడ్డి బయటపెట్టారు. అయితే ఇప్పటికే ఆ కార్లకు 66 కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు వాటిని తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి. సీఎం రేవంత్ మాత్రం… మాజీ సీఎం కేసీఆర్ వాడిన కాన్వాయ్ నే కంటిన్యూ చేస్తున్నారు. తన సొంత కారుకు తగ్గట్టుగా వాటికి కూడా బ్లాక్ కలర్ వేయించారు. అయితే విజయవాడలో ఉన్న 22 కార్లల్లో మూడింటిని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో వాడుకోవాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు సూచించారు. సీఎం భద్రతను దృష్టిలో పెట్టుకొని కనీసం మూడైనా ప్రస్తుత కాన్వాయ్ లో చేర్చాలని భావిస్తున్నారు. మరి మిగిలిన కార్లను ఏంచేయాలి అనే దానిపైనా సూచనలు చేశారు. మిగతా కార్లను సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటకు వెళ్ళినప్పుడు వాడుకోడానికి వీలుగా వాటిని జిల్లా కేంద్రాలకు పంపాలని ISW అధికారులు సూచించారు.

త్రిహాయని సంస్థ VVIP కాన్వాయ్ లోని కార్లకు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేస్తూ ఉంటుందని ISW అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా బుల్లెట్ ప్రూఫ్ కార్లను తయారు చేస్తున్నట్టు తెలిపారు. తొందర్లోనే ఏపీ నుంచి ల్యాండ్ క్రూయిజర్ కార్లు హైదరాబాద్ కు రాబోతున్నాయి.