Narendra Modi: డీపీలు మార్చుదాం సరే.. మరి విద్వేషపు గోడల సంగతేంటి..?

ఎర్రకోటపై పదోసారి జాతీయ జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ దేశ ప్రజలకు ఓ పిలుపు ఇచ్చారు. దేశభక్తి భావం ఉప్పొంగేలా దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలు మార్చి జాతీయ జెండా పెట్టుకోవాలని సూచించారు.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 02:42 PM IST

ఎర్రకోటపై పదోసారి జాతీయ జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ దేశ ప్రజలకు ఓ పిలుపు ఇచ్చారు. దేశభక్తి భావం ఉప్పొంగేలా దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలు మార్చి జాతీయ జెండా పెట్టుకోవాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా యావత్ దేశం జెండా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. సోషల్ మీడియా డీపీలుగా జాతీయ పతాకం పెట్టుకోవాలని సూచించారు. బాగుంది. మోడీ మంచి సలహానే ఉన్నారు. దేశం అన్నాక, పౌరులన్నాక తాము పుట్టిన దేశంపై ప్రేమ, అభిమానం, గౌరవం కచ్చితంగా ఉండాలి. జాతీయ వాదాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్న మన దేశంలో దేశభక్తి ఓ కొలమానం అయిపోయింది. సరే ప్రధానమంత్రి చెప్పినట్టు మనమంతా డీపీలు మార్చేద్దాం. త్రివర్ణ పతాకాన్ని మన రూపంగా మార్చుకుందాం. సోషల్ మీడియా వేదికగా స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుందాం.

ఆగస్టు 15 ఉదయం నుంచి రాత్రి వరకు దేశభక్తి భావంతో ఉప్పొంగిపోదాం. ఇవన్నీ చేస్తూనే మరో కోణంలో కూడా చర్చించుకుందాం. 77వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు యావత్ దేశం సిద్ధమవుతున్న వేళ సగటు మనిషిగా మన మనసులో మెదిలే కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టి 76ఏళ్లు పూర్తయ్యింది కదా.. ఈ దేశ ప్రజలు పూర్తిస్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారా ? ఈ దేశ పౌరులందరికీ రాజ్యాంగ ఫలాలు సమానంగా అందుతున్నాయా ? రాజ్యాంగ స్పూర్తితో పాలకులు వ్యవహరిస్తున్నారా ? ఇవన్నీ ఎందుకు సాటి మనిషిని మనిషిగా గౌరవించే సమాజంలోనే మనం ఉన్నామా ? కులాల కుంపట్లు, మతాల పేరుతో విద్వేషాలు ఇవి కదా రోజు పేపర్లలో మనం చదువుకుంటున్నది. మణిపూర్‌లో నాలుగు నెలలుగా ఏం జరుగుతోంది ? హర్యానాలో మత ఘర్షణలు ఎందుకు చెలరేగాయి ? శాంతియుత వాతావరణంలో సామర్యంగా జీవించాల్సిన ప్రజలు ప్రత్యర్థులుగా ఎందుకు మారుతున్నారు ? డీపీలు మార్చుతూనే మనం వీటి గురించి కూడా మాట్లాడుకుందాం.

విద్వేషం న్యూ నార్మల్

ప్రస్తుతం మన దేశంలో విద్వేషం అన్న పదం న్యూ నార్మల్‌గా మారిపోయింది. ప్రజల మధ్య విద్వేషాన్ని నాయకులు, పాలకులు గట్టిగానే ఇంజెక్ట్ చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా చీల్చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. మన మతం కాని వాడిని అనుమానంతో చూసేలా ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టించారు. విద్వేషంతో రగిలిపోయి ప్రజలు పరస్పరం దాడులకు తెగబడుతుంటే.. ఘర్షణలు సృష్టించే వేడిలో చలికాసుకుంటున్నారు మన సోకాల్డ్ నేతలు. మణిపూర్ , హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏదైనా కావొచ్చు..ప్రజలను పార్టీలు, పాలకులు చూసేది మాత్రం ఓటు బ్యాంకు కోణంలోనే. మణిపూర్‌లో గిరిజనులు, గిరిజనేతరులు మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడంలో అక్కడి పాలకులు ఏ స్థాయిలో విఫలమయ్యారో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలే ప్రపంచానికి చూపించాయి. మణిపూర్ గుండెకు గాయమైనా ఆ గాయానికి మందు రాయడంలో పార్లమెంట్‌ కూడా విఫలమైంది. మూడు రోజుల పాటు అవిశ్వాసంపై చర్చ జరిగితే.. .విపక్షాలపై సెటైర్లు వేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న ప్రధానమంత్రి… మణిపూర్‌పై నామమాత్రంగా మాట్లాడి ముగించేశారు. మణిపూర్‌లో జరిగిన ఘర్షణలను వేలాది మందిని వలసవాదులుగా మార్చాయి. సొంత దేశంలో నిలువనీడలేక చాలా మంది మియన్మార్ బాట పట్టారు.

విద్వేషాలు లేని సమాజాన్ని నిర్మించలేమా ?

విద్వేషం పాలించే దేశం ఉంటుందా…కంచె సినిమాలో సిరివెన్నెల సంధించిన ప్రశ్న ఇది. నిజంగానే విద్వేషం పునాదుల మీద ఏ దేశం మనుగడ సాధించలేదు. పాలకులే విద్వేషాలను రెచ్చగొట్టి… సమాజాన్నే చీల్చుతుంటే.. ఇక సోషల్ మీడియాలో ప్రజలు మార్చుకునే డీపీలు తిరంగా స్పూర్తిని నింపుతాయా అన్నదే ప్రశ్న. శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం, సాటి మనిషిని మనిషిగా చూసే మానవత్వం ఇవి కదా ఇప్పటి సమాజానికి కావాల్సింది. ప్రజల మధ్య వీటిని కదా పాలకులు పెంచి పోషించాల్సింది. ఆజాదీకి అమృతోత్సవాల్లో భాగంగా… కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయో తెలియదు గానీ… ప్రజల మధ్య విద్వేష భావాలను తొలగించేందుకు జన సమూహాలే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ముక్కు ముఖం తెలియని ప్రజలను కూడా ఒక్క చోటకు చేర్చి.. మేమంతా సమానమే నిజమైన రాజ్యాంగ భావనకు నాంది పలుకుతున్నాయి.

మేరే ఘర్ ఆఖే తో దేఖో

పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం విద్వేషాలు రెచ్చగొడుతుంటే.. ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంటే.. ఆగస్టు 15 నుంచి ఓ వినూత్న కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చాయి. దాని పేరే మేరే ఘర్ ఆఖేతో దేఖో… మా ఇంటికి రండి..మాతో కాసేపు గడపండి అంటూ ఆహ్వానం పంపుతోంది ఈ సంస్థ. కులం, మతం, ప్రాంతం, లింగం, సెక్యువాలిటీ ఇలా వేటితోనూ సంబంధం లేకుండా… ఎవరైనా ఎవరి ఇంటికైనా వెళ్లి వాళ్లను పరిచయం చేసుకుని వాళ్లిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించడమే ఈ మేరే ఘర్ ఆఖే తో దేఖో. రాజ్యాంగం ముందు ప్రజలంతా సమానమే.. కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నవి మనిషి సృష్టించుకున్నవే… బతికినంతకాలం సమభావంతో బతుకుందాం అన్న సందేశాన్ని ఇస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా. దేశ వ్యాప్తంగా మొదలైన ఈ క్యాంపెయిన్ లో తెలంగాణ నుంచి దాదాపు 40 వేలమంది పాల్గొంటున్నారని అంచనా. మేరే ఘర్ ఆఖే తో దేఖో వెబ్ సైట్ లోకి వెళ్లి ఎవరైనా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా కూడా ఆహ్వనాలు పంపొచ్చు. దేశవ్యాప్తంగా 50కి పైగా ఎన్జీవో సంస్ఖలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. పాలకులు విభజించి పాలించినా ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో స్నేహభావాన్ని మొలకెత్తిస్తాయి. మీరు వేరు మేం వేరు అన్న భావనను పోగడతాయి. దేశాన్ని ఇలాంటివి మాత్రమే ఐక్యం చేయగలగుతాయి. విద్వేషపు గోడలను పగలగొట్టడానికి ప్రజలను ఏకం చేయడానికి చేయాల్సిందే ఇదే… డీపీలు మార్చితే సరిపోదు.