తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 10న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనను ఒక వారంలో ముగించుకుని ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది.
ప్రత్యేక సమావేశాలు..
రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో అధికార యంత్రాంగాన్ని ఎన్నిలక ఏర్పాట్లకు, విధులకు హాజరయ్యేలా కార్యాచరణను ప్రకటించనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందం మరో మూడు రోజుల్లో తెలంగాణకు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ లో పర్యటించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ అధికారులతో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనుంది. గతంలో పర్యటించి ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన అంశాలను పరిశీలించింది. దాని ఆధారంగా ఈ సారి హైదరాబాద్ వేదికగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇప్పటి వరకూ అందుతున్న ప్రాధమిక సమాచారం.
డిశంబర్లో పోలింగ్..
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల షెడ్యూల్ ను పరిశీలించినట్లయితే 2018 అక్టోబర్ 6న విడుదల చేసింది. డిశంబర్ మొదటి వారంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. అంటే 2 నెలల కాలంలో అభ్యర్థుల నామినేషన్, నామినేషన్ల ఉపసంహరణ, బూత్ ల ఏర్పాటు, ఓటర్ స్లిప్పుల పంపిణీ వీటన్నింటినీ సజావుగా జరిగేలా చూసింది. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులకు కూడా ప్రచారానికి చాలా సమయం కేటాయించారు. బీఆర్ఎస్ గతంలో రెండు మూడు సార్లు క్యాంపెయింగ్లో పాల్గొంది. ఇప్పుడు కూడా అదే జోష్ ని కొనసాగిస్తూ తమ పార్టీ నేతలను గెలుపే లక్ష్యంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇక బీజేపీ అయితే జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపి తెలంగాణలో ప్రచారం సాగించాలని భావిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది.
అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తే తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సారి ఎవరు అధికారాన్ని సాధిస్తారో తెలియాలంటే ఎన్నికలు సజావుగాసాగి ఫలితాలు విడుదలయ్యే వరకు వేచిచూడక తప్పదు.
T.V.SRIKAR