రామోజీరావులాంటి వ్యక్తిని ఇంతలా హింసించడం కరక్టేనా అని.. పార్టీలకు సంబంధం లేని వారు చెప్తున్న మాట. రామోజీ అంటే.. మూడు పదాల పేరు మాత్రమే కాదు. మహిష్మతి బాహుబలిలా.. ఈనాడు, రామోజీ సామ్రాజ్యానికి అధినేత ఆయన. మీడియా బ్యారన్. దేశం మొత్తం మహామహులు అనుకునే నాయకులు కూడా.. రామోజీరావు సలహాలు, సూచనల కోసం వస్తుంటారు. అదీ రామోజీ రేంజ్. ఇదంతా ఎలా ఉన్నా.. మార్గదర్శి కేసులో ఎప్పుడూ చూడని పరిస్థితి ఎదుర్కొంటున్నారు రామోజీరావు.
కేంద్రమే రామోజీ ఆర్థిక మూలాలపై చూసీ చూడనట్లు ఉంటుంది. అంతెందుకు జగన్ తండ్రి వైఎస్ఆర్ కూడా.. రామోజీని వ్యక్తిగతంగా విమర్శించారే తప్ప.. వ్యాపారాలు, ఆర్థిక మూలాల జోలికి వెళ్లలేదు ఎప్పుడూ ! అలాంటిది జగన్ ఇప్పుడు.. రామోజీరావుకు చుక్కలు చూపిస్తున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి వృధాగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. రామోజీకి కేంద్రం రక్షణగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. మాములుగా మోదీ, అమిత్‌షాకు.. రామోజీ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. 2014 ఎన్నికలకు ముందు ఫిల్మ్‌సిటీ వచ్చి మరీ కలిశారు మోదీ. ఈ మధ్యే అమిత్ షా కూడా.. రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు ఎవరు వచ్చినా.. రామోజీని కలవకుండా వెళ్లరు దాదాపుగా! ఆ స్థాయిలో బీజేపీ నుంచి రామోజీకి మద్దతు ఉంది.
ఐతే ఇప్పుడు మార్గదర్శి కేసులో సీఐడీ ఇబ్బంది పెడుతున్నా.. కేంద్రం సపోర్టుగా నిలుస్తుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అత్యంత ప్రభావశీల వ్యక్తి అంటూ మన్ కీ బాత్ కార్యక్రమంలో రామోజీని మోదీ పొగడడమే దీనికి నిదర్శనం అనే చర్చ జరుగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రచారం కల్పించడంలో రామోజీ అందరికంటే ముందు ఉన్నారని.. పెద్దవయసు వారైనా యువకులకు మించి వేగంతో పనిచేస్తున్నారంటూ మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ ప్రోగ్రాం ఈ నెల 30న టెలికాస్ట్ కానుంది. రామోజీ ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని ఎంత ప్రయత్నించినా.. కేంద్రం సపోర్టు ఉన్నన్ని రోజులు.. ఆయన సామ్రాజాన్ని టచ్ చేయడం జగన్‌కు సాధ్యం కూడా కాదనే చర్చ జరుగుతోంది. దీనికితోడు సీబీఐ కేసు ఎలాగూ వెంటాడుతోంది. కేంద్రం మద్దతు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో రామోజీకి రక్షణగా నిలిచిన కేంద్రం మాటను.. జగన్ కాదు అంటారా అంటే.. ఆ ప్రసక్తే లేదనేది మెజారిటీ వర్గాల అబిప్రాయం.