ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్ కు తెర, హైబ్రిడ్ మోడల్ లో మెగాటోర్నీ

ఛాంపియన్స్ ట్రోఫీపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే హైబ్రిడ్ మోడల్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రెండు వేదికల్లో మెగా టోర్నీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యమివ్వనుండగా.. మిగిలిన దేశాల మ్యాచ్ లన్నీ పాకిస్థాన్ లో జరగనున్నాయి.

  • Written By:
  • Publish Date - December 14, 2024 / 07:49 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే హైబ్రిడ్ మోడల్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రెండు వేదికల్లో మెగా టోర్నీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యమివ్వనుండగా.. మిగిలిన దేశాల మ్యాచ్ లన్నీ పాకిస్థాన్ లో జరగనున్నాయి. మొదటి నుంచి హైబ్రిడ్ మోడల్ కు పాక్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకున్నా… చివరకు బీసీసీఐ ఒత్తిడి ఫలించి , ఐసీసీ వార్నింగ్ తో పాక్ బోర్డు అంగీకరించక తప్పలేదు. పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో భారత్ ఆ దేశం వెళ్ళేందుకు నిరాకరించింది. పీసీబీ ఎంత ఒత్తిడి తెచ్చినా టోర్నీ నుంచి వైదొలుగుతాం తప్ప పాక్ వచ్చేది లేదని బీసీసీఐ తేల్చేసింది. దీంతో భారత్ లాంటి పెద్ద జట్టు ఇలాంటి మెగా టోర్నీలో ఆడకుంటే నిండా మునిగిపోవడం ఖాయమని అర్థం చేసుకున్న ఐసీసీ హైబ్రిడ్ మోడల్ కు ఓకే చెప్పింది. అటు పాక్ క్రికెట్ బోర్డు కూడా గత్యంతరం లేక భారత్ మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించేందుకు ఒప్పుకుంది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కు ఎలాంటి ఆర్థిక పరిహారం కూడా చెల్లించడం లేదు.

అయితే 2027 తర్వాత ఓ ఐసీసీ మహిళల టోర్నమెంట్ ను మాత్రం పాకిస్థాన్ కు కేటాయించడానికి ఐసీసీ అంగీకరించింది. అయితే 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ టీమ్ కూడా ఇండియాకు రావడం లేదు. ఈ మెగా టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా ఉన్న శ్రీలంకలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ.. ముగ్గురూ ఈ ఒప్పందంపై సంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య సద్దమణిగింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా పాకిస్థాన్ మొత్తం పది మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది. అయితే ఇండియా ఆడే మూడు లీగ్ మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. ఇందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది.

అంతేకాదు ఒకవేళ ఇండియా సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే ఉంటాయి. ఇండియన్ టీమ్ లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమిస్తే పాకిస్థాన్ లోని లాహోర్, రావల్పిండి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరగనుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూపు నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్స్ వెళ్తాయి. గతేడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్ కూడా ఇలా హైబ్రిడ్ విధానంలోనే జరిగింది. ఇండియా మ్యాచ్ లతోపాటు సెమీఫైనల్, ఫైనల్ కొలంబోలో జరిగాయి. 2017 తర్వాత మళ్ళీ ఎనిమిదేళ్ళకు ఈ టోర్నీ జరగబోతోంది. చివరిసారి జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. అటు 2013లో ధోనీ సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్ ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.