ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. గడిచిన 53 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిలును మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే ఇందులో కొన్ని షరతులను పొందుపరిచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఐదు షరతులు..
చంద్రబాబుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో ఐదు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. లక్షరూపాయలు చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలి అని తెలిపింది. తన సొంత ఖర్చులతో వైద్య చికిత్స చేయించుకోవాలి అని పేర్కొంది. చంద్రబాబు దేనికి సంబంధించి చికిత్స చేయించుకుంటున్నారు.. ఆ ఆస్పత్రి వివరాలు జైలుకు సమర్పించాలి అని చెప్పింది. కేసును ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయకూడదని సూచించింది. నాలుగు వారాల మధ్యంతర బెయిలు కావడంతో నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి వెళ్ళాలని తెలిపింది. తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లే సమయంలో చికిత్స చేయించుకున్న పూర్తి మెడికల్ డాక్యూమెంట్లు సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్ కు సమర్పించాలని కోరింది.
పూర్తి ప్రక్రియ ఇదే..
అయితే నవంబర్ 10న ప్రధాన బెయిల్ పిటిషన్ పై వాదనలు విననుంది ఏపీ హైకోర్టు. ఇందులో ఏమైనా కొన్ని అంశాలు తెరపైకి వస్తే మధ్యంతర బెయిలుపై ప్రభావంపడే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. అయితే ఆయనను వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల చేస్తారా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. దీనికి కారణం ఏసీబీ కోర్టు గతంలో జ్యూడీషియల్ రిమాండును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని రద్దు చేయాలంటే తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలు ఉత్తర్వులను ఏసీబీ కోర్టుకు అందించాలి. దీనిని ఏసీబీ కోర్టులోని న్యాయమూర్తి స్వీకరించి పరిశీలిస్తారు. ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు చంద్రబాబును విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తారు. అప్పుడు జైలు ఫార్మాలిటీలు అన్ని పూర్తి చేసి చంద్రబాబును విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగితే ఈరోజు సాయంత్రానికి జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. లేకుంటే రేపు తప్పకుండా బయటకు వస్తారు.
T.V.SRIKAR