స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి నెల రోజులు దాటుతోంది. సుప్రీం కోర్టు వరకు వెళ్లిన.. క్వాష్ పిటిషన్ వ్యవహారంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తోంది. టీడీపీ నేతలు, నారా నందమూరి కుటుంబ సభ్యులు.. ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తూ.. ఆయన సూచనలు తీసుకుంటున్నారు. నెలరోజులుగా జైల్లో ఉండడంతో.. చంద్రబాబు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఉక్కపోత కారణంగా.. అలర్జీ వెంటాడుతోందని నేతలు అంటున్నారు. ఇక అటు చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీబీఎన్ లైఫ్ ఎట్ రిస్క్ హ్యాష్‌ట్యాగ్‌తో కుటుంబసభ్యులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులుపై ఆయన కుమారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబు నాయుడు ప్రాణానికి తక్షణ ముప్పు ఉందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. జైల్లో చంద్రబాబుకు భద్రత లేదని అన్నారు. చంద్రబాబు నాయుడుకు జైల్లో స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం, జైలు అధికారులు ఏదో దాస్తున్నారనే అనుమానం కలుగుతుందని ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబుకు తగిన సదుపాయాలు లేని, అపరిశుభ్ర కారాగార పరిస్థితుల మధ్య నిర్బంధంలో ఉన్నారు. ఆయన ఆరోగ్యానికి ఆందోళనకర రిస్క్‌ను తీసుకొస్తుందని ట్వీట్ చేశారు లోకేశ్. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేశారని.. ఆయనకు అత్యవసర వైద్య పర్యవేక్షణ అవసరం ఏర్పడిందని అన్నారు. ఆయన 5కిలోల బరువు తగ్గారని.. మరింత బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అటు కోడలు బ్రాహ్మణి కూడా ఇలాంటి ట్వీటే చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. అపరిశుభ్రమైన జైల్లో ఆయనను నిర్బంధించటం హృదయవిదారమని ఆవేదన చెందారు బ్రాహ్మణి. నారా, నందమూరి కుటుంబాలతో పాటు.. టీడీపీ శ్రేణులు కూడా సీబీఎన్ లైఫ్ ఎట్ రిస్క్ హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్లు చేస్తున్నాయ్. దీంతో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.