‘జైలుకు వెళ్లే జగన్ సీఎం ఎలా అవుతాడు..’ ఐదేళ్ల ముందు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శ ఇది. జగన్ సీఎం కాలేడని.. ఒకవేళ సీఎం అయినా జైలు నుంచి ప్రజలను పాలిస్తాడా అని పవన్ చురకలంటించాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా.. ఇప్పుడు అదే పవన్.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటున్నారు. స్కామ్ జరిగిందని ఆధారాలున్నా చంద్రబాబుపై కక్షతోనే అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుంటున్నారు. చంద్రబాబు మంచోడు..ఉత్తముడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే కదా అసలు సిసలైన రాజకీయమంటే..!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) 2012లో అరెస్టు చేసింది. దాదాపు 16నెలల తర్వాత జైలు నుంచి జగన్ విడుదలయ్యారు. ఇప్పటికీ జగన్‌కు కేసుల నుంచి విముక్తి లభించలేదు. ఇదే అస్త్రంతో టీడీపీ, జనసేన జగన్‌ని కార్నర్ చేస్తూ ఉంటాయి. సోషల్‌మీడియాలో ఈ రెండు పార్టీల వింగ్‌లు జగన్ కేసుల గురించి ట్రోల్ చేస్తుంటాయి. శుక్రవారం పని చేయని జగన్ అంటూ ఎగతాళి చేస్తుంటాయి. జగన్ అవినీతిపరుడని.. 40ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు మిస్టర్ క్లీన్ అని చెబుతుంటాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా అక్రమాలకు పాల్పడినట్టు సీఐడీ తేల్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు ఆయనే అంటూ అభియోగాలు మోపింది. దీంతో వైసీపీ చేతికి భారీ అస్త్రం దొరికినట్టైంది.
ఇప్పుడు చంద్రబాబు కూడా జైలుకు వెళ్లారని.. ఆయనపై కూడా కేసులున్నాయి వైసీపీ ప్రచారం చేసుకోవచ్చు. ప్రజలు కేసులు, జైలు అనే పదాలకు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆ కేసులో కుట్రపూరితంగా పెట్టారా.. కక్షసాధింపులకు పెట్టారా అని కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారా..? స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏం జరిగిందన్నది ఎవరూ పెద్దగా పట్టించుకోరు. చంద్రబాబు..అరెస్టు.. ఈ రెండు పదాలే వినిపిస్తుంటాయి..రచ్చబండలపై చర్చనీయాంశమవుతుంటాయి. జగన్ జైలుకు వెళ్లడానికి సోనియాగాంధీకి చంద్రబాబు మద్దతిచ్చారని అనేక ఆరోపణలున్నాయి. కావాలనే జగన్‌ని జైలుకు పంపారని వైసీపీ నేతలు వాదిస్తుంటారు.. ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ టీడీపీ నేతలు అదే వాదిస్తున్నారు. ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే ‘అందరూ దొంగలే’ అని మరికొంతమంది బ్రెయిన్ ఉన్నవాళ్లు అంటుంటారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీలు ఏం ఉండవు..అంతా ప్రజలను మభ్యపెట్టే డ్రామాలే..!