CHANDRABABU NAIDU: ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైంది. సీఎం జగన్.. మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజా గళం పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాను ఒంటరినని, తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యయని జగన్ అంటే.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు అంటున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు.
YS JAGAN: ఇటువైపు నేనొక్కడినే.. అటువైపు తోడేళ్ల గుంపు: జగన్
జగన్‌కు ఏడు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఇచ్చిన హామీలపైనే ఆయన ప్రశ్నించారు. అవి.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు..? మద్య నిషేదం ఎందుకు అమలు చేయలేదు..? కరెంటు చార్జీల తగ్గింపు ఏమైంది..? ఏటా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు..? సీపీఎస్ ఎందుకు రద్దు చేయలేదు..? మెగా డీఎస్సీ సంగతేంటి..? పోలవరం పూర్తి ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు. తన ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మూడు పార్టీల పొత్తుపైనా చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు మాకు మద్దతివ్వాలని కోరారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో 49 చోట్ల వైసీపీని గెలిపిస్తే ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. ఈసారి 52 చోట్లా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు.
జగన్ తన చర్యలతో రాష్ట్రాన్ని లూటీ చేశారని, అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, మద్యం ధరలను అమాంతం పెంచేశారని చంద్రబాబు ఆవేదనవ్యక్తం చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. ఆఖరికి ఇసుకపైనా దోపిడీ చేసి, భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారన్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచేశారని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారని గుర్తు చేశారు.